గిరిజనులు వ్యవసాయంలో రాణించాలి

18 Nov, 2023 01:54 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ ప్రారంభిస్తున్న ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి
● ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి

శ్రీశైలంప్రాజెక్ట్‌: చెంచు గిరిజనులు ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయంలో రాణించాలని ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్‌ట్రైనింగ్‌ సెంటర్‌లో శుక్రవారం చెంచుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే క్రమంలో భాగంగా వారి సామర్థ్యాల పెంపుపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జన జాతీయ గౌరవదివస్‌–ట్రైబల్‌ ప్రైడ్‌ డే లోభాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీఓ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ అటవీ భూ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం పట్టాలుగా ఇచ్చిన భూముల్లో చేసే వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఆధునిక పద్ధతులపై శిక్షణ పొంది పంటపొలాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకుకొని అనువైన పంటలు సాగు చేస్తే అధిక దిగబడులు సాధించవచ్చునన్నారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ అధికారుల సహకారంతో వ్యవసాయం చేసుకోవాలని, పండ్ల తోటల పెంపకంతో మంచి దిగుబడులు సాధించి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని గిరిజనులకు సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఓఎస్‌డీ ఆర్‌.కొండలరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆంజనేయులు, హార్టికల్చర్‌ అధికారి బీసీ ధనుంజయ, ఏపీఓ సురేష్‌కుమార్‌, ఫారెస్ట్‌ రైట్స్‌ చెంచుగిరిజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు