మందుకు బానిసై ఆమెను ఇ​బ్బంది పెట్టా

22 Nov, 2019 16:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను డిగ్రీ చదువుతుండగా రాంగ్ కాల్ ద్వారా ఒక అమ్మాయి పరిచయమైంది. మొదట తన పేరు హరిని అని చెప్పింది. నేను కూడా వంశీ అని చెప్పాను. కానీ, అప్పటినుంచి ఫోన్లో వీలు దొరికినప్పుడల్లా మాట్లాడుకోవడం వలన మా మధ్య చనువు పెరిగింది. నాపై నమ్మకం కలిగినందువలన తన అసలు పేరు చెప్పింది. కానీ, నేను తనని ఆ పేరుతో ఎప్పుడూ పిలవలేదు. తనని ముద్దుగా అమ్ము అని పిలిచేవాడిని. తనకి కూడా ఆ పేరు నచ్చింది. నా పేరు నాని అని తనకు చెప్పాను. అలా ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగాక ఫోటోలు పంపించుకున్నాము కొరియర్లో. అలా కొన్నిరోజులకి నేను అమ్ముకి ప్రపోజ్ చేశాను. మొదట్లో అమ్ము కంగారుపడినా చివరకు నా ప్రేమని అంగీకరించింది. అప్పుడు మొదటిసారి తనని కలవడానికి తన ఊరికి వెళ్లాను. ఆ ఊరు పేరు వింటేనే భయం వేసింది కానీ, ప్రేమిస్తే రిస్క్ ఉంటుంది! రిస్క్ ఫేస్ చేస్తేనే ప్రేమించాలి.

భయపడేవాడికి ప్రేమ అక్కర్లేదని అన్నింటికీ తెగించి అమ్ము ఉండే ఊరు కర్నూలులో అడుగుపెట్టాను. అక్కడ బస్టాండ్లో నేను మొదటిసారి అమ్ముని చూశాను ఆ ఒక్క క్షణం నాకు అంత పెద్ద బస్టాండ్‌, అంతమంది జనాభా, భారీ శబ్దాలు ఇవేవీ కనిపించలేదు.. వినిపించలేదు. తను వైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది తనని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్ము కోసం ఎంత రిస్క్ అయినా చేసి తనని పెళ్లి చేసుకోవాలని ఆ క్షణమే నా మనసులో ధృడంగా నిశ్చయించుకున్నాను. అప్పట్నుంచి ఇద్దరం కలిసి సినిమాలు, షికార్లు, టెంపుల్స్, ఐస్‌ క్రీమ్‌ పార్లర్స్, మంచి ప్రదేశాలు అన్ని చూశాము. తన కోసమే నేను నా ఎంబీఏ అక్కడే చేశాను. అలా 7 సంవత్సరాలు ప్రేమించుకున్నాము. చివరికి నా స్టడీ పూర్తి చేసి తనని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకున్నా.

మా ఇద్దరి మధ్యా ఒక విషయంలో ఎప్పుడూ గొడవ జరిగేది. అది డబ్బుల విషయంలో.. ఎందుకంటే నేను మందుకు బాగా బానిసయ్యాను. దాని కోసమే అమ్ముని మనీ అడిగి తీసుకునేవాడిని. అమ్ములో నాకు నచ్చేది ఏమిటంటే నన్ను డ్రింక్ చేయకు అని ఎప్పుడూ ఫోర్స్‌ చేయలేదు. కానీ, ఎప్పటికన్నా నేను తనకోసం మానేస్తాను అని నమ్మకం. కానీ, నేను మద్యానికి బానిసనై తనని కూడా డబ్బులు ఇమ్మని వేధించేవాడిని. తను చాలా సార్లు నాకు ఇచ్చింది. కానీ ఒక్కటి ఏ అమ్మాయి అయిన ఎంతకాలం ఓపికతో భరిస్తుంది. తనకు నాపై విరక్తి వచ్చే అంతగా నేను మద్యానికి బానిసనై అందుకోసమే ఆమెని మనీ అడిగి అడిగి లేదంటే గొడవపడి తనకి నాపై ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోయేలా చేసుకున్నాను. చివరికి ఆ కారణం వల్లనే మేము విడిపోయాము. నేను అమ్ముని విడిచిపెట్టినంత సులభంగా మందుని విడిచిపెట్టుంటే నా జీవితం ఇలా ఒంటరిగా ఉండేది కాదు.

అమ్ముకి వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేశారు. నేను ఒంటరి వాడినై పోయాను. అప్పుడు ఆలోచించాను! కేవలం ఆల్కహాల్ కారణంగా నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నానా?.. అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఇంకెప్పటికీ డ్రింక్ చేయకూడదని. అప్పటినుంచి ఇప్పటివరకు నేను పూర్తిగా మందు విడిచిపెట్టేశాను. కానీ, ఇదేదో ముందే చేసుంటే అమ్ము ఇవాళ నాతో ఉండేది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం నా జీవితంలో జరిగిపోయింది. ఇప్పుడు నేను తనని తిరిగి తీసుకుని రాలేను. కాలాన్ని వెనక్కి మార్చనూలేను. ఇది నాకు ఒక గుణపాఠం అని గ్రహించి ముందుకువెళ్తున్నా. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నప్పటికీ ఒక్కటే లోటు! అమ్ము నాతో లేదు. నా జీవితంలా మీ జీవితం కాకూడదని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి.. 
- నాని, నెల్లూరు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు