ప్రేమ జంటల్లో ఆరు రకాలు

31 Oct, 2019 13:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మనుషుల్లోలానే ప్రేమ జంటల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. మన వ్యక్తిత్వం, అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు మనల్ని ఇతరులనుంచి వేరు చేస్తున్నట్లే.. వేరువేరు ధృవాలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు జంటగా మారినపుడు ఆ జంట ఇతర జంటల కంటే భిన్నంగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వంగా కలిసుండటం జంటలో ఆరోగ్యకరమైన బంధానికి దోహదపడుతుంది. మనచుట్టూ రకరకాల జంటలను మనం నిత్యం చూస్తూ ఉంటాము. ఆ జంటలను పరీక్షగా గమనిస్తే జంటల మధ్య తేడాలను మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా జంటలలో ఈ ఆరు రకాలను చూడొచ్చు.

1) ఆదర్శవంతమైన జంట
ఇలాంటి జంటలు చాలా అరుదు. ఇద్దరిలా కాకుండా ఇద్దరూ ఒకరే అన్నట్లు కలిసిపోయి జీవిస్తుంటారు. ఈ జంట వేరే వ్యక్తులతో ఎక్కువగా కలవటానికి ఇష్టపడదు. ఒకరికిఒకరై జీవిస్తుంటారు. 

2) అయోమయం జంట
ఈ జంట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేము. ఓ రోజు పోట్లాడుకుంటారు, నీకు నాకు కుదరదు అనుకంటారు. ఆ మరుసటి రోజే చేతుల్లో చేయి వేసుకుని ఏ పార్కులోనో, కాఫీ షాపుల్లోనో కన్పిస్తారు. ఎంత పోట్లాడినా కలుసుండే తత్వం వీరిది. 

3) పబ్లిక్‌ జంట 
ఈ జంట పబ్లిక్‌లో తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. తమ ప్రేమను ఇతరుల ముందు చూపటానికి ఎలాంటి ఇబ్బందిపడరు! అక్కడ ఎంతమంది ఉన్నా సరే. ఇతర జంటలు ఈర్శ్య పడేలా చేయటమే వీరి పని.

4) ఆఫీసు జంట 
ఈ జంట తమ పనిని, ప్రేమను బ్యాలెన్స్‌ చేస్తూ జీవితాన్ని సాగిస్తుంటుంది. కలిసి ఎక్కువ సమయం గడపటానికి వీరికి అవకాశం తక్కువ. బాసుకు భయపడో లేదా వృత్తి ధర్మానికి కట్టుబడో తమ ప్రేమను ఆఫీసులో తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతుంటారు.

5) తూనీగ తూనీగ జంట
ఈ జంట చిన్నతనం నుంచి ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. చుట్టు ప్రక్కలవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని ప్రేమ వీరిది. అమాయకమైన ప్రేమనుంచి పరిణితి చెందిన ప్రేమగా మారిన వీరి బంధాన్ని అందరూ గమనిస్తూ ఉంటారు. షారుఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ల ప్రేమను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

6) మిస్టర్‌ అండ్‌ మిస్‌ పర్‌ఫెక్ట్‌ జంట
ఇలాంటి జంటలు కోటికి ఒకటి అన్నట్లుగా ఉంటాయి. ఇలాంటి జంటలోని వారు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు. నిజమైన ప్రేమకు వీరు నిదర్శనం. ఒకరి ఉన్నతికోసం ఒకరు శ్రమిస్తుంటారు. ప్రేమించుకుంటారు, గొడవపడతారు, ఏడుస్తారు! వీటి వల్ల రోజురోజుకు జంట మధ్య ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు.

మరిన్ని వార్తలు