ఇద్దరం విడిపోయేదాకా వెళ్లాం.. ఆయన వల్ల..

6 Feb, 2020 16:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ‘ప్రేమ’ .. ఈ పదం వినటానికి బాగుంటుంది! అనుభవించేదాకా తెలీదు ఆ ఎదలోని చిక్కులు. ఆ చిక్కుముడుల్ని విప్పినపుడే ఆ ప్రేమ ఫలిస్తుంది. కాదని లాగావో అదింకా చిక్కుపడిపోతుంది. చాలా ఓపికగా నేను ఆ ముడుల్ని విప్పాననే అనుకుంటున్నా. దాని ఫలితమే నా ప్రేమ.. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. రోజూ కాలేజీకి వెళ్లడం, రావడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయటం, చదువుకోవటం.. ఇదే నాలోకం. అయితే ఒకరోజు అనుకోకుండా ఓ పెళ్లికి బంధువుల ఇంటికి నేనొక్కదాన్నే వెళ్లాల్సివచ్చింది. ఆ పెళ్లిలోనే పరిచయమయ్యాడు హరీష్‌. అతని రాకతో నా జీవితం చాలా పెద్ద మలుపు తిరిగిందనే చెప్పాలి. అతను నాకు వరసకు బావ అవుతాడు. చిన్నప్పటినుంచి పరిచయమున్నా. అతనితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, అతనికి నేనంటే ఎప్పటినుంచో ఇష్టమని ఆ రోజే తెలిసింది.

పెళ్లిలో అతను అందరితో కలిసిపోవటం అందరినీ బాగా చూసుకోవటం, పెళ్లి బాధ్యతంతా తనదే అయినట్టు నడుచుకోవటంతో అతనిపై నాకు మంచి అభిప్రాయం కల్గింది. ఫంక్షన్‌ అయ్యేసరికి చాలా ఆలస్యం అవడంతో అతను నన్ను ఇంటి దగ్గర దింపటానికి వచ్చాడు. ఆ జర్నీలోనే అతడు నాకు ప్రపోజ్‌ చేశాడు. ముందుగా నేను ఆశ్చర్యపోయాను. కానీ, నాక్కూడా అతని ప్రవర్తన నచ్చింది. తెలిసిన వ్యక్తే కావడంతో ఓకే చెప్పేశా. ఇక అప్పటినుంచి అన్నీ తానే అయ్యాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకమ్మాయిని పరిచయం చేసి తను నా క్లోజ్‌ ఫ్రెండ్‌ అని చెప్పాడు. తన పేరు స్వాతి! నేను తనతో బాగా మాట్లాడేదాన్ని. తనూ నాతో అలాగే మాట్లాడేది. కానీ, మాటిమాటికీ.. మా బావ అలా.. మీ బావ ఇలా.. నువ్వు బాగా చూసుకోవాలి.. నీకేం తెలీదు అని చెప్తూ ఉండేది. మొదట్లో ఏం అనిపించకపోయినా, తర్వాతర్వాత కోపం వచ్చేది.

మా బావ గురించి నాకు తెలీకపోవడమేంటి? రెండు సంవత్సరాలనుంచి తనతో ఉంటున్నా కదా అనిపించేది. అయినా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. గడుస్తున్న కొద్దీ మా బావంటే తనకూ ఇష్టమని నాకు తెలిసింది. కానీ, ఆ విషయం బావకి తెలీకపోవడటంతో ఆమెకే ఎక్కువ ప్రిపరెన్స్‌ ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఏమైనా అంటే తను నా ఫ్రెండ్‌ అనేవాడు. ఆమె మాత్రం మేము విడిపోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసేది. కానీ, నా ప్రేమ ముందు అవేవీ నిలబడలేదేమో. నా బాధ చూడలేక ఆ దేవుడే మా బావని తనకు దూరం చేశాడేమో అనిపిస్తుంది.. కాకపోతే ఏంటి? దాదాపు విడిపోయేదాకా వెళ్లిన మేము, స్వాతి వాళ్ల నాన్న వల్ల ఒక్కటయ్యాం. వాళ్ల నాన్నకి నేనెవరో తెలీకపోవచ్చు.

కానీ, తన కూతురి జీవితం బాగుండాలని చేసిన ఒక పని వల్ల నా జీవితం నిలబడింది. తన తండ్రికిచ్చిన మాట వల్ల తనూ సంతోషంగా ఉంది. నేను నా బావతో సంతోషంగా ఉన్నా.. మొదట్లో ఆమె మాట్లాడకపోతే ఎంతో బాధపడిన బావే.. మెల్లిమెల్లిగా తన పనిలో పడిపోయాడు. నన్ను మొదటికన్నా ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు. మా ఇంట్లో వాళ్లని కూడా మా పెళ్లికి ఒప్పించాడు. ఇక మిగిలింది మా పెళ్లిరోజే అందుకే అంటారేమో.. ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. ఆవేశపడకుండా కాస్త వేచి చూడటం ఉత్తమం..
- దీప్తి, జగిత్యాల

మరిన్ని వార్తలు