అందాలరాశి సాహిబా... మీర్జా ప్రేమలో..

8 Oct, 2019 10:22 IST|Sakshi

ఖీవా (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని గుజరాత్ జిల్లాలో ఉన్న ఊరు)లో పొద్దుపోని పిల్ల కవులు సాహిబా మీద రకరకాల పాటలు అల్లి పాడేవారట. ఒకడేమో... ‘డొక్కలు మాడ్చుకొని ఎముకలు తేలిన కరువుసీమ... నీ నవ్వులు విని ఆకాశానికేసి చూసి విన్నావా ఆ నవ్వులు అని అడిగింది. ఆకాశం నీ నవ్వులకు బహుమతిగా వర్షాన్ని ఇచ్చింది’ అని రాస్తే... ఇంకొకడేమో... ‘సూర్యుడిని చూస్తే చాలా అనుమానంగా ఉంది నాకు. రోజూ లోకం కోసం వస్తున్నాడా?  నిన్ను చూడ డానికే  వస్తున్నాడా?!’ అని రాస్తాడు.సాహిబా ఎక్కడికి వెళితే అక్కడ ఒక అందమైన స్తబ్దత రాజ్యమేలేది. అంగడికి  వెళితే... కన్ను తిప్పనీయని ఆమె అందాల మైకంలో పడి ఒక వస్తువుకు బదులు మరొకటి అడిగేవాళ్లు కొనుగోలుదారులు.  పప్పు కోసం వచ్చినవాడు ‘ఉప్పు కావాలి’ అని అడిగేవాడు. ఒకడేమో డబ్బులు ఇచ్చి వస్తువులు తీసుకోకుండానే ఆమె అందాన్ని తలచుకుంటూ ఇంటి ముఖం పట్టేవాడు.

అంతమంది మతులు పోగొట్టిన  అందాలరాశి సాహిబా... మీర్జా ప్రేమలో పడింది. పొడవాటి జుత్తుతో, నవయవ్వన తేజస్సుతో వెలిగిపోయే మీర్జా.. అందంలో సాహిబాకు ఏమాత్రం తీసిపోడు. గుర్రాల్ని దౌడు తీయించడంలో, విలువిద్యలో అతడికి గొప్ప నైపుణ్యం ఉంది. మక్కీ అనే తన గుర్రం మీద రాజకుమారుడిలా వచ్చేవాడు. సాహిబా, మీర్జా ఇద్దరూ ఒకే బడిలో  కలిసి చదువుకున్నారు. ఒకరి సంతోషం ఇంకొకరిదై రెట్టింపయ్యేది. ఒకరి దుఃఖం మరొకరిదై సగమయ్యేది. వారి ప్రేమ గురించి ఊరంతా  తెలిసిపోయింది. మండిపడ్డాడు సాహిబా తండ్రి. తాహిర్ ఖాన్ అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయిం చాడు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. తన పెళ్లి గురించిన సమాచారాన్ని మీర్జాకు రహస్యంగా చేరవేసింది సాహిబా. మీర్జా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమ యంలో ఆ కళ్లు కోపంతో ఎర్రబారాయి.

మీర్జియా చిత్రంలోని ఓ దృశ్యం
‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగడానికి వీలులేదు’ అని పిడికిలి బిగించాడు. తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు కూడా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మొదట బెదిరించారు. ‘మనతో పోలిస్తే వారి బతుకెంత? మన స్థాయికి తగిన అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం. తనని మర్చిపో’’ అని బతిమాలారు. మీర్జా ఆ బెదిరింపులకు భయ పడలేదు. భావోద్వేగాలకు లొంగిపోలేదు. మీర్జా రాక కోసం ఎదురుచూస్తున్న సాహిబా తన ఇంట్లో ఒక ద్వారాన్ని రహస్యంగా తెరిచి ఉంచింది. ఆ ద్వారం గుండా లోపలికి వచ్చిన మీర్జా... సాహిబాను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆమె కనిపించకపోవడంతో ‘ఏదో జరిగింది’ అంటూ సాహిబా సోదరులు కత్తులు, బాణాలతో గుర్రాల మీద బయలుదేరారు. వాళ్లకు మీర్జా- సాహిబాలు గుర్రం మీద వెళ్తూ కనిపించారు.

వెంటనే వాళ్లు తమ గుర్రాలను రాక్షస వేగంతో పరుగులు తీయించి, మీర్జా మీద బాణాల వర్షం కురిపించారు. ఒక బాణం సూటిగా పోయి మీర్జా గొంతును చీల్చింది. మరుక్షణం నేల కూలాడు. మరో రెండు బాణాలు అతని గుండెల్లో గుచ్చకున్నాయి. బాధతో విలవిల్లాడాడు. అతడిని కాపాడటానికి రక్షణ వలయంలా నిల్చుంది సాహిబా. బాణాలు ఆమె ఒంటిని చీల్చేశాయి. కానీ వారి ప్రేమను మాత్రం చీల్చలేకపోయాయి. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ... తమ ప్రేమకథను అజరామరం చేసుకుంటూ... ఒక్కటిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారిద్దరూ! మీర్జా సాహిబాల ప్రేమకథ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కాయి.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు