సలీం.. అనార్కలీ

1 Oct, 2019 12:20 IST|Sakshi

మొఘల్‌ సామ్రాట్‌ అక్బర్‌ కుమారుడైన సలీం ఓ రోజు దానిమ్మ తోటలో ఉండగా ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. తాను యువరాజునని చెప్పకుండా ఆమెతో స్నేహం చేస్తాడు. ఆ యువతి పేరు నదిరా బేగం. ఆమె కూడా సలీంతో ప్రేమలో పడుతుంది. ఓ సారి నదిరా బేగం గాన నాట్యాలకు ముగ్దుడైన అక్బర్‌ ఆమెను ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. దానిమ్మ తోటలో(అనార్‌ అంటే హిందీలో దానిమ్మ) కనిపించింది గనుక అనార్కలి అనే బిరుదునిస్తాడు.  సలీం మేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌కు అల్లుడి ప్రేమ విషయం తెలుస్తుంది. అనార్కలిని మరచిపొమ్మని మాన్‌సింగ్‌ హెచ్చరిస్తాడు. సలీం వినకపోయే సరికి అతడిని తనతో పాటు యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడతారు.

అప్పుడు సలీం ఆమెను తన వెంట తెచ్చుకుంటాడు. తర్వాత సలీం యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలు చేసి అతన్ని కాపాడుకుంటుంది. అయితే సలీం మామూలు సైనికుడు కాదని  అక్బర్ కొడుకని  తెలుసుకుంటుంది. అనార్కలి తక్కువ కులంలో పుట్టిన యువతి. తక్కువ కులం వారితో ఏటువంటి సంబంధమైనా అప్పటి సమాజంలో నిషిద్ధం. సలీంతో ప్రేమ వ్యవహారం అక్బర్‌ మహారాజుకు నచ్చదన్న విషయం అనార్కలికి తెలుసు. అయినప్పటికి సలీంకు దూరంగా ఉండలేకపోతుంది. వీరి ప్రేమ విషయం అక్బర్‌కు తెలిసిపోతుంది. తన కొడుకు ఓ సాధారణ నాట్యకత్తెతో ప్రేమలో పడటం అక్బర్‌ జీర్ణించుకోలేకపోతాడు. అనార్కలిని సలీం దృష్టిలో పడకుండా చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న అనార్కలి సమాధి
విషయం తెలుసుకున్న సలీం కన్న తండ్రిపైనే యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో సలీం ఓడిపోతాడు. అతడికి మరణశిక్ష పడుతుంది. తన ప్రియుడ్ని మరణం నుంచి తప్పించటానికి అనార్కలి తన ప్రేమను.. ప్రాణాలను పణంగా పెడుతుంది. అక్బర్‌.. సలీం కళ్లముందే ఆమెను సజీవంగా ఇటుకలతో సమాధి చేయిస్తాడు. అనంతరం తన కుమారుడిని ప్రాణాలతో వదలిపెడతాడు.

మరిన్ని వార్తలు