చీకటి వెలుగుల శివకాశి

22 Oct, 2019 12:30 IST|Sakshi

దీపావళిలోని వెలుగునీడలు జీవితానికి సంకేతంగా భావిస్తారు. అందుకనే చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి అన్నారో సినీకవి..! కటిక చీకట్లకి కొలమానం అమావాస్య అయితే.. వెలుగుల వెల్లువకు పతాక సన్నివేశంగా దీపావళిని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒకేసారి కలగలిపి మనముందు ప్రజ్వలించే పండుగే దీపావళి. సుఖదుఃఖాలకు, జయాపజయాలకు, మంచిచెడులకు నిండైన ప్రతీకే దీపావళి. జీవితంలో తారసిల్లే మంచిచెడులను కలగలిపి దీపావళి సరంజామాతో పోల్చిచూస్తారు. అందులోనూ దీపావళి అందరి పండుగ. దీపావళి అంటే మనందరికీ ఎంత సరదానో..! మరి ఆ సరదా వెనుకు దాగి ఉన్న నిజాల వెలుగులు కూడా తెలుసుకోవాలి కదా..! జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. గువ్వలా బతకమని తారాజువ్వ చెబుతుంది. నిప్పుతోటి చెలగాటం వల్ల ముప్పుతప్పదని తానందుకు ప్రత్యక్ష సాక్ష్యమని టపాకాయ చెబుతుంది'. ఇలా తరచి తరచి చూస్తే దీపావళి నిండా జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ చాలానే ఉంటుంది.

తమస్సు నుంచి ఉషస్సుకు
దీపావళి పండుగ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది టపాకాయలు. ఆ టపాకాయలకు దేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ప్రాంతం శివకాశి. ఇక్కడ చాలా తక్కువ ధరకు మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. మనకు చౌకగా లభ్యమయ్యేవంటే మక్కువ ఎక్కువ. ప్రపంచ మార్కెట్‌లో శివకాశి బాణాసంచాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వివరాల్లోకెళ్తే.. 1960వ సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే శివకాశిలో ఉన్న నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ది చెందాలని నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. ఈ విషయాలు తెలుసుకున్న అప్పటి భారత ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ ఈ నగరానికి కుట్టి జపాన్‌ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది మినీ జపాన్‌గా ప్రశస్తి సాధించింది.

కేవలం నెహ్రూ పేరు పెట్టారనే కాదు కానీ.. ఇది నిజంగా మినీ జపానే..! ఎందుకంటే ఇక్కడి వారందరూ కుటీర పరిశ్రమలపై ఆధారపడే జీవనం సాగిస్తారు. ఇ‍క్కడ పనిచేసే కార్మికుల్లో కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, నాణ్యత, కలిసికట్టుతనం వంటి లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దీపావళి సమీపించే కొద్దీ ఇ‍క్కడ పనిచేసేవారు ఎక్కువ శ్రమిస్తారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. నేడు ఈ ప్రాంతంలో నిరుద్యోగం కనిపించదు. 100శాతం ఉపాధి ఈ పట్టణం సొంతం. దాదాపు 3లక్షల మంది కార్మికులు బాణాసంచా, అగ్గిపుల్లల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. శివకాశి శివారులోని 15కు పైగా గ్రామాల్లో ఈ పరిశ్రమలు ఉండగా తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాదిమంది కార్మికులు వలసలు వచ్చి ఇ‍క్కడ పనిచేస్తుంటారు. 

శివకాశి స్వరూపం
రాష్ట్రం - తమిళనాడు
జిల్లా -విదూర్‌నగర్‌
పట్టణ విస్తీర్ణం - 343.76
జనాభా - 2.6 లక్షలు
అక్షరాస్యత - 77శాతం
పరిశ్రమలు - 8,000
బాణాసంచా వ్యాపారం - ఏటా దాదాపు 2వేల కోట్లు
వెలుగుకు మార్గం
శివకాశిలో తయారైన బాణాసంచా దీపావళి రోజున దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి దీపపు కాంతి వెలుగు ప్రసరించడానికి కారణమయ్యే అగ్గిపుల్లలు కూడా 70శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 
దీపం జ్యోతిః పరబ్రహ్మ
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే పర్వం 
సంధ్యా దీపం నమోస్తుతే

జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. 

ఎప్పుడు ఏం జరుగుతుందో..!
పుష్కరకాలంగా ఈ ప్రాంతంలో అనేక ఘోరప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్దీ ప్రమాదాలు అధికమవుతూ ఉంటాయి. పండుగ సమయంలో డిమాండ్‌ రీత్యా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇ‍క్కడ అనుమతి పొందిన 700 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 2లక్షల మంది కార్మికులు, అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్షమంది దాకా పనిచేస్తుంటారు. 

దేశానికి అవసరమైన బాణాసంచాలు, అగ్గిపుల్లలు 80శాతం ఇక్కడే తయారవుతాయి. ఇ‍క్కడి కార్మికులు పరిశ్రమల్లో రసాయనాల నుంచి తలెత్తే రుగ్మతల నుంచి బయటపడడానికి ఎక్కవగా అరటిపండ్లు తింటుంటారు. ఇక్కడి పొడి వాతావరణం బాణాసంచా తయారీకి అనుకూలం. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతుంటాయి. భారీవర్షాలు, నదులు, పచ్చని పంటపొలాలు ఇక్కడ పెద్దగా కనిపించవు. దీపావళి రోజున చీకట్లు తొలగించి వెలుగులు విరజిమ్మాల్సిన బాణసంచా ఇక్కడి అభాగ్యుల జీవితాల్లో చీకట్లను నింపిన సందర్భాలెన్నో..!

మరిన్ని వార్తలు