నా బాధ ఆమె పట్ల ద్వేషంగా మారకముందే..

6 Oct, 2019 12:09 IST|Sakshi

ఇంకో రెండు రోజుల్లో సంక్రాంతి. పండగకళ ముందస్తుగానే మా ఊరికి చేరింది. నా ముఖంలోనేతై ఏ కళా లేదు. అది దారి తప్పి ఎన్ని రోజులవుతుందో? కిటికీ దగ్గర కూర్చొని షెల్లీ పుస్తకంలో ‘ది క్లౌడ్’ కవితను చదువుకుంటున్నాను. చావుపుట్టుకల గురించి రాసిన కవి ‘ఐ చేంజ్ బట్ కాంట్ డై’ అంటున్నాడు. పుస్తకం టేబుల్ మీద పెట్టి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్నాను. మేఘం కనిపిస్తుంది. సందేశం పంపనా?  ఎక్కడుందని పంపేది? ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకే తెలియదు. పోయిన సంక్రాంతి రోజు ఆమె భోగిమంటల దగ్గర పరిచయం అయింది. పండగ సెలవుల్లో  పట్నం నుంచి వాళ్ల తాతగారి ఇంటికి వచ్చింది. గలగలా మాట్లాడేది. పది రోజుల మా పరిచయం ప్రేమగా మారింది. ఆమె సిటీకి వెళ్లిన రోజు నేను పడిన బాధ  ఇంతా అంతా కాదు. అయితే ఆ బాధను లేఖలు తీర్చాయి. ఒకరికొకరం తరచుగా ప్రేమలేఖలు రాసుకునేవాళ్లం. అంతేకాదు...సిటీకెళ్లి కాలేజీలో ఆమెను కలిసేవాడిని.

మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో తెలిసిపోయింది. ఉన్నట్టుండీ ఆమె మాయమైపోయింది. పిచ్చిపట్టినట్లు రోజూ కాలేజికి వెళ్లేవాడిని... ఆమె వస్తుందని ఆశ.... ఆ ఆశ రోజూ అడియాసే అవుతున్న రోజుల్లో ఒకరోజు...ఆమె నుంచి ఫోన్  వచ్చింది. ‘సారీ’ చెప్పింది. ‘మన ప్రేమ మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ల మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఇంటికే కాదు మా సిటీకే కాదు, రాష్ట్రానికి చాలా దూరంగా మా అక్కయ్య వాళ్ల ఇంట్లో ఉంటున్నాను. అక్కడే చదువుకుంటున్నాను. ప్లీజ్...నన్ను మరిచిపో’’ అని చెప్పింది.  ‘‘మీ అక్కయ్య ఎక్కడ ఉంటారు?’’ అని  ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు.  ఆ తరువాత తన ఫోన్ నంబర్ మార్చేసింది. సృష్టిలోని చీకటంతా నా కళ్లలో చేరినట్లు అనిపించింది. చావాలని కూడా అనిపించింది. ఏదో గుర్తొచ్చినట్లు ‘ఐ చేంజ్ బట్ కాంట్ డై’ వాక్యాన్ని వందోసారి చదువుకున్నాను. అవును. నేను మారాలి. ఒక అమ్మాయి కోసం నేను జీవితాన్ని చీకటి చేసుకోవడం కంటే మూర్ఖత్వం ఉంటుందా? అందుకే నేను మారుతాను.

తప్పకుండా మారుతాను. ఆమెను మరచిపోవడానికి, నేను మారడానికి ఎన్నో నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. విఫలమవుతూనే ఉన్నాను. విరాగినవుతూనే ఉన్నాను. ఈరోజు భోగి. అదిగో భోగిమంట. గత సంవత్సరం  పవిత్రంగా, అందంగా కనిపించిన భోగిమంట...ఇప్పుడు నా గుండెలో మంటై దర్శనమిస్తుంది. ఏదో గుర్తొచ్చింది. నాకు. ప్రేమలేఖలు! ఒక లేఖలో- ‘‘సూర్యుడు రోజూ ఉదయిస్తాడట...కానీ  నీ కంటి వెలుగులో తప్ప....ఎక్కడా చూడలేదు. నీ నవ్వుల మెరుపుల్లో తప్ప చంద్రుడి వెన్నెలను ఎక్కడా చూడలేదు’ అని రాశాను. ఎంత పిచ్చివాడిని! ఇప్పుడు వెలుగూ లేదు. వెన్నెలా లేదు. నా బాధ ఆమె పట్ల ద్వేషంగా మారకముందే...ఆమెను పూర్తిగా మరచిపోవాలి. ఈ ప్రేమలేఖలు నా దగ్గర ఉన్నంత వరకు ఆమెను మరిచిపోదా మనుకున్నా మరువలేకుండా ఉన్నాను. అందుకే భోగిమంటల్లో వీటిని కాల్చేయాలి. ఆమెను నా మనసు నుంచి తుడిచేయాలి. ప్రేమలేఖలను తీసుకొని భోగి మంట దగ్గరకు వెళ్లాను.

కొద్దిసేపట్లో వాటిని మంటల్లో వేయబోతుంటే... భోగిమంటల దివ్యవెలుగుల్లో ఒక మోము నా ప్రాణమై కనిపించింది...కలా నిజామా? అనుకునేలోపే ఆమె నా  దగ్గరికి వచ్చింది. ‘నేను నీకు దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాననుకున్నానేగానీ... నన్ను నేను ఇక్కడే మరిచిపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. నువ్వు లేకుండా బతకలేనన్న విషయాన్ని తెలుసుకున్నాను. అదే విషయం మా అమ్మానాన్నలకు సున్నితంగా  చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. ఆశీర్వదించారు. ఇక నేను నిన్ను ఎప్పటికీ విడిచి వెళ్లను. మన ప్రేమకు ఈ భోగిమంటే సాక్షి’ అంది ఆమె. మాట రాని మౌనమిది. మౌనమే గానమై... భోగిమంట నా కన్నుల పంటైన పర్వదినమిది! ఈ మంట దగ్గరే మేమిద్దరం ‘ప్రేమ’ కాచుకున్న సువర్ణదినమిది.
- సుహాస్

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు