నా పేరులో సెక్సప్పీల్ లేదన్నారు!

23 Jan, 2015 03:21 IST|Sakshi
నా పేరులో సెక్సప్పీల్ లేదన్నారు!

 పదహారేళ్ల వయసులోనే పేరు కోసం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిందని సుప్రసిద్ధ నటి వహీదా రెహమాన్ అన్నారు. జైపూర్ లిటరరీ ఫెస్టివల్‌లో గురువారం ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ‘‘మద్రాసులో ఉండగా, పదహారేళ్ల వయసులో హిందీ సినిమాలో నటించమని నటుడు, దర్శక, నిర్మాత గురుదత్ బొంబాయికి పిలిపించారు. ‘సిఐడి’ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు కాంట్రాక్టు సైన్ చేసే సమయంలో పేరు మారుస్తామని చెప్పారు. అయితే నేను అంగీకరించలేదు అన్నారు. మధుబాల, దిలీప్ కుమార్, మీనాకుమారి తదితరులంతా తమ అసలు పేరును వదిలి వేరే పేర్లు పెట్టుకున్నారు. అది ఒక ఆచారమని, కనుక నీ పేరు మార్చుకోవాల్సిందేనని వాళ్ళు బలవంతపెట్టారు.
 
  అంతేకాక ‘వహీదా రెహమాన్’ అనే పేరులో సెక్సప్పీల్ లేదు కనుక, తప్పనిసరిగా మార్చాల్సిందేనని, లేకుంటే వేరొకర్ని చూసుకుంటామని అన్నారు. అది నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కనుక నేను దానిని మార్చుకోనని, కావాలంటే సినిమాయే వదులుకుంటానని చెప్పాను. అయితే మీరు హోటల్‌కు వెళ్లండి, మేం ఏ సంగతి చెప్తామని పంపించేశారు. కానీ, మూడు రోజుల తర్వాత నా పేరుతోనే కొనసాగడానికి అంగీకరించారు’’ అని వహీదా తెలిపారు. తాను నటించిన సినిమాల్లో ‘గైడ్’ తనకు ఇష్టమని, అది కాకుండా ‘ఖామోషీ’, ‘ముఝే జీనే దో’, ‘ప్యాసా’, తనది ముఖ్య పాత్ర కాకపోయినా ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ ఇష్టమని అన్నారు.
 
 తాను చూసిన దర్శకుల్లో గురుదత్, సత్యజిత్‌రే చాలా గొప్పవారని, అయితే గురుదత్ ఒక్క టేక్‌తో సంతృప్తిపడేవారు కారని, సత్యజిత్‌రే అనవసరంగా ఒక్క టేక్‌కు మించి చేసినా అంగీకరించేవారు కాదని అన్నారు. ఒక సినిమాకోసం గురుదత్ 76 టేక్‌లు తీసుకున్న సందర్భం చరిత్రలో ఉందని గుర్తుచేశారు. ఈ తరం నటుల్లో అభిషేక్ బచ్చన్ నాతో స్నేహంగా ఉండే నటుడని, ఇంతకాలం గడిచినా ప్రజలు ఎక్కడికి వెళ్లినా తనను ఆదరించడం చూసి తనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదని కరతాళధ్వనుల మధ్య చెప్పారు.
 (జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)