మంచి చెడుల మేళవింపే సినిమా

9 Nov, 2017 12:26 IST|Sakshi
జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఆర్‌.పి.పట్నాయక్‌

చెడును వదిలేసి మంచినే స్వీకరించాలి

సినీ సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌

కాజీపేట భవాని థియేటర్‌లో బాలల చలన చిత్రోత్సవం

‘ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుంది.. చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం తెలుసుకునే అవకాశం ఉంటుంది.. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటే’ అని సినీ సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ అన్నారు. నగరంలోని భవాని థియేటర్‌లో రూరల్‌ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బాలల చలన చిత్రోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు.

వరంగల్‌ రూరల్‌: మంచి చెడులను మేళవించి చెప్పేదే సినిమా అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని బుధవారం వరంగల్‌ నగరం కాజీపేటలోని భవానీ థియేటర్‌లో రూరల్‌ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్ధమాన నటి హిమాన్షి చౌదరి కలిసి ప్రారంభించి మాట్లాడారు. బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు తొలుత మంబాయిలో నిర్వహించారని, ఆ తర్వాత దేశంలోని ప్రముఖ పట్టణాలకు విస్తరించాయని, 1993 నుంచి హైదరాబాద్‌ శాశ్వత వేదికైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఈ వేడుకలు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని, దీని వల్ల జిల్లాలోని పిల్లలు సినిమాలు చూసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.

ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుందని, చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి, జీవన విధానం పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటేనని, ప్రాంతాలు, భాషలకు అతీతంగా మంచిని పంచేదే సినిమా అని వివరించారు. సినిమాపై ఒక దురాభిప్రాయం కూడా ఉందని, చెడు చూసి అంతా చెడిపోతున్నారనే అపోహను తోసిపుచ్చారు. చెడుపై మంచి ఎలా గెలుస్తుందో చెప్చేదే సినిమా అని, మంచినే స్వీకరించాలని సూచించారు. డీఆర్వో భూక్యా హరిసింగ్‌ మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో 21 సినిమాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. డీఈఓ కె.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలకు చెందిన 14వేల మంది విద్యార్థులకు వారం రోజుల పాటు సినిమాలు చూపిస్తామని, రోజుకు 1800 నుంచి 2వేల మందికి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఆర్వో కిరణ్మయి, ఖాదీ విలేజ్‌ బోర్డు రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌ గీసుగొండ ఎంఈఓ.సృజన్‌ తేజ, భవానీ థియేటర్‌ యజమాని తదితరులు పాల్గొన్నారు.

    మాట్లాడుతున్నఆర్‌.పి.పట్నాయక్‌

మరిన్ని వార్తలు