శాంతనుకు జంటగా పార్వతినాయర్

29 Sep, 2016 01:46 IST|Sakshi
శాంతనుకు జంటగా పార్వతినాయర్

యువ నటుడు శాంతనుకు జంటగా నటి పార్వతీనాయర్ నటించనున్నారు. సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ కొడుకు శాంతను అన్న విషయం తెలిసిందే. ఈయన కథానాయకుడిగా పలు చిత్రాలలో నటించారు. ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి వాయ్‌మై అనే చిత్రంలోనూ నటించారు. అయినా హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని అందుకోలేకపోయారు. కాగా కె.భాగ్యరాజ్ శిష్యులలో ఒకరు పార్తీపన్. దర్శకుడిగా, కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను చేసిన పార్తీపన్ కథై, తిరైకథై వచనం, ఇయక్కం చిత్రం తరువాత దర్శకుడు మరో చిత్రం చేయలేదు.
 
 చాలా గ్యాప్ తరువాత తాజాగా కొడిట్ట ఇడంగలై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తన గురువు వారసుడు శాంతనుని కథానాయకుడిగా ఎంచుకున్నారు. ఇక కథానాయకిగా చాలా మందిని పరిశీలించిన పార్తీపన్ చివరికి నటి పార్వతినాయర్‌ను ఎంపిక చేశారు. మొదట ఈ చిత్రంలో కొత్త నటిని నాయకిగా పరిచయం చేయాలని భావించినా పార్వతినాయర్ తన కథలోని నాయకి పాత్రకు చక్కగా నప్పుతారని ఆమెను ఎంపిక చేసినట్లు పార్తీపన్ స్పష్టం చేశారు.
 
  ఇక నటుడు శాంతనును హీరోగా ఎంపిక చేయడంపై వివరిస్తూ శాంతను విజయం కోసం చాలా సిన్సియర్‌గా కృషి చేస్తున్నారన్నారు.అయినా ఎందుకనో అది ఆయనకు దూరం అవుతూనే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే శాంతను విజయం వెనుక తాను ఉండాలని భావించానన్నారు. గురువుకి శిష్యుడిగా అది తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా బ్లాంక్‌లను పూర్తి చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పార్తీపన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిందన్నది గమనార్హం.