త్రిష @17

15 Dec, 2019 09:10 IST|Sakshi

త్రిష @17  అని ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దక్షిణాదిలో పోరాడి గెలిచిన నటీమణుల్లో త్రిష ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకుని, మోడలింగ్‌ రంగంలో గుర్తింపు పొందినా, సినీ కథానాయకిగా రాణించడానికి చాలా కష్టాలనే చవిచూసిన నటి త్రిష. అలా ఒక సైడ్‌ పాత్ర ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జోడీ చిత్రంలో సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రలో నటించింది. అలా 1999లో సినీ తెరంగేట్రం చేసిన త్రిష హీరోయిన్‌గా తెరపై కనిపించడానికి మరో మూడేళ్లు పట్టింది. లేసా లేసా చిత్రంలో ప్రియదర్శన్‌ ఈ బ్యూటీకి హీరోయిన్‌ అవకాశం కల్పించారు. 

ఆ తరువాత ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రంలో నటించే చాన్స్‌ను అందుకుంది. అలా రెండు చిత్రాల్లో నటించినా, తొలిసారిగా వెండితెరపై త్రిష కనిపించింది మాత్రం మౌనం పేసియదే చిత్రంతోనే. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి అమీర్‌ దర్శకుడు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో త్రిషకు అవకాశాలు వరుస కట్టాయనే చెప్పాలి. అయితే త్రిషను స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది మాత్రం సామి చిత్రమే. విక్రమ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి హరి దర్శకుడు. సామి చిత్రం కమర్శియల్‌గా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్‌తో జత కట్టిన గిల్లి చిత్రం త్రిష క్రేజ్‌ను మరింత పెంచేసింది. ఇలా కోలీవుడ్‌లో వెలిగిపోతూనే, తెలుగులోనూ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. అలా కన్నడంలో ఒకటి, హిందీలో ఒక చిత్రం చేసి భారతీయ నటిగా పేరు తెచ్చుకుంది. 

అయితే ఎవరికైనా జీవితంలో గానీ, వృత్తిలో గానీ వడిదుడుకులన్నవి సర్వసాధారణం. అందుకు త్రిష అతీతం కాదు. వ్యక్తిగతంలో పలు చేదు అనుభవాలను చవిచూసింది. ఇక నటిగానూ వరుస ఫ్లాప్‌లతో సతమతం అయ్యింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదంటారు. అలా త్రిషకు 96 చిత్రంతో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల కోరిక పేట చిత్రంతో నెరవేరింది. ఈ రెండు చిత్రాల హిట్‌తో త్రిష పేరు మరోసారి లైమ్‌టైమ్‌లోకి వచ్చింది. ఆమె నటించిన మూడు నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మిస్తున్న రాంగీ చిత్రం ఒకటి. దీనికి ఏఆర్‌.మురుగదాస్‌ కథ, కథనాలను అందించడం విశేషం. 

ఇకపోతే తాజాగా మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించే అవకాశం త్రిషను వరించింది. అత్యంత భారీబడ్జెట్‌లో రూపొందుతున్న ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి,విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యరాయ్‌ ఇలా భారీ తారాగణమే నటిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఇకపోతే తెలుగులో చాలా గ్యాప్‌ తరువాత ఒక మెగా చాన్స్‌ను త్రిష అందుకుందన్న సమాచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అదేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటించనుందని సమాచారం. ఇలా మరోసారి దక్షిణాలో మరో రౌండ్‌కు సిద్ధమైన త్రిష యమ ఖుషీలో ఉంది. కాగా ఆమె అభిమానులయితే త్రిష @17  పేరు తో పండగ చేసుకుంటున్నారు. త్రిష 17 ఏమిటనేగా మీ సందేహం. ఈ బ్యూటీ వయసు జోలికి పోకండి. సినీరంగ ప్రవేశాన్ని 1999లో చేసింది. అలా చూసుకుంటే నటిగా రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అయితే హీరోయిన్‌గా తెరపై మెరిసింది మాత్రం 2002లో. ఆ విధంగా 17 వసంతాలను పూర్తి చేసుకుంది.ఈ లెక్కను పరిగణలోకి తీసుకున్న ఈ బ్యూటీ అభిమా నులు త్రిష @17  పేరుతో పండుట చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు