సాక్షి ఎఫెక్ట్‌: అవినీతి అధికారిపై వేటు  | Sakshi
Sakshi News home page

సాక్షి ఎఫెక్ట్‌: అవినీతి అధికారిపై వేటు 

Published Sun, Dec 15 2019 9:07 AM

Mines Department Assistant Director Suspension - Sakshi

సాక్షిప్రతినిధి విజయనగరం: రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అక్రమాలు నిరంతరం సాగవు. ఎవరూ చూడటం లేదనీ... ఏమైనా చేసేయొచ్చనీ... సొంత నిర్ణయాలు తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. అవినీతిని ఏమాత్రం సహించబోమని అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టంచేసిన సీఎం అందుకోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా పెట్టారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.వి.వి.ఎస్‌.చౌదరిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విజయనగరం రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అధికారిగా, విశాఖపట్నం మైన్స్‌ అండ్‌ జియాలజీ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న చౌదరిని విధుల నుంచి తప్పిస్తూ జీఓ నెం.344ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఊరుదాటి వెళ్లకూడదంటూ ఆదేశించింది. 

డీడీకీ అదనపు బాధ్యతలు 
రీజనల్‌ విజిలెన్స్‌ స్కాడ్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను విజయనగరం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.పూర్ణచంద్రరావుకు అప్పగించింది. గనుల శాఖ అధికారులు కొందరు మైనింగ్‌ మాఫియాతో చేతులు కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత నెల 20వ  తేదీన ‘అక్రమార్కులకు అండ’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ కథనంపై వెంటనే స్పందించిన గనులశాఖ మంత్రి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా పేషీ అధికారులను ఆదేశించారు. వారు అన్ని వివరాలను సేకరించి చౌదరి, మరికొందరు అధికారుల చిట్టాలను సేకరించి మంత్రికి అందజేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కొందరు వ్యక్తులు, కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక పరి్మట్లను చౌదరి ఇచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. మరికొందరు అవినీతి అధికారులపైనా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.


  

Advertisement
Advertisement