స్పెషల్ హీరోయిన్స్..

15 Jul, 2016 15:41 IST|Sakshi

దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలేస్తున్న ముగ్గరు కథానాయకులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్. తమ విలక్షణ నటనతో, అసాధరణ ప్రతిభతో, అంతకు మించి అదిరిపోయే అభిమానుల ఫాలోయింగ్తో ఖాన్ త్రయం బాక్సాఫీస్ వద్ద తిష్ట వేసుకుని కూర్చుంది.  బాలీవుడ్లో అడుగుపెట్టే ప్రతి ముద్దుగుమ్మకి ఈ ఖాన్ త్రయం సరసన  నటించాలనేది పెద్ద కలే. అంతమంది అందాల తారల్లో ఆ అరుదైన అవకాశాన్ని అందుకున్న ఆ స్పెషల్ బ్యూటీస్ ఎవరో ఓ సారి లుక్కేద్దాం..

మాధురీ దీక్షిత్.. ఒక్క పాటకి కాలు కదిపి ఇండస్ట్రీని ఊపేసిన డ్యాన్సింగ్ డాల్.. షారుఖ్, సల్మాన్లతో కలిసి ఒకేసారి  'హమ్ తుమ్హారే హై సనమ్' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత షారుఖ్ తో కలిసి అంజామ్, దిల్ తో పాగల్ హై, కోయ్లా, దేవ్ దాస్ లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించి అభిమానుల నీరాజనాలందుకుంది. ఇక సల్మాన్తో నటించిన 'హమ్ ఆప్ కే హై కౌన్' ఎవర్ గ్రీన్ సినిమాల లిస్ట్లో నిలిచిపోయింది. మరి కొన్ని హిట్ సినిమాల్లో ఆమె సల్మాన్ తో జోడీ కట్టింది. ఆమీర్ తో కలిసి దిల్, దీవానా ముఝ్ సా నహీ లాంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.  

కాజోల్..  షారుఖ్తో కాజోల్ కెమిస్ట్రీకి పరిచయం అక్కర్లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విడుదలైన 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' ఇప్పటికీ దేశంలోని ఏదోక మూల ధియేటర్లలో విజయవంతంగా ఆడుతూనే ఉందంటే.. ఆ జోడీ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న షారుఖ్, కాజోల్ లు 'బాజీగర్'తో మొదలుపెట్టి కరణ్ అర్జున్,  దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, ఇటీవల విడుదలైన దిల్ వాలే వరకు ప్రేక్షకులను అలరించారు. ఇక కండలవీరుడు సల్మాన్ తో కలిసి కాజోల్ 'ప్యార్ కియాతో డర్నా క్యా'లో కనువిందు చేయగా, ఆమీర్ తో 'ఫనా'లో కనిపించి కవ్వించింది.

ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన బబ్లీ బ్యూటీ రాణీ ముఖర్జీ కూడా ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న తారల్లో ఒకరు. కింగ్ ఖాన్ తో 'కుచ్ కుచ్ హోతా హై'లో నటించిన రాణీ.. ఆ తర్వాత చల్తే చల్తే, పహేలీ, కభీ అల్విదా న కెహనాలాంటి సినిమాల్లో కనిపించింది. సల్మాన్ కు జోడీగా బాబుల్, కహీ ప్యార్ న హో జాయే, చోరీ చోరీ చుప్కే చుప్కేల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమీర్ తో 'గులామ్' సినిమాలో రాణి పండించిన రొమాన్స్ అంత ఈజీగా మర్చిపోయేది కాదు. 'ఆతీ క్యా ఖండాలా' పాట ఈనాటికి యువతను ఊపేస్తుందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. 'తలాష్'లో కూడా ఆమీర్ భార్యగా నటించింది రాణీ.

ఆ తర్వాత లేటెస్ట్ సెన్సేషన్.. అనుష్క శర్మ. ప్రస్తుతం బాలీవుడ్లో పోటీ పడుతున్న తారల్లో అనుష్క ముందు వరుసలో ఉంది. షారుఖ్ 'రబ్ నే బనాదీ జోడీ'తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే ప్రతిభ గల తారగా గుర్తింపు సంపాదించుకుంది. జబ్ తక్ హై జాన్ లో మరోసారి షారుఖ్ సరసన మెరిసిన ఈ తార.. ఆమీర్ తో కలిసి 'పీకే'లో నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ 'సుల్తాన్'లో జోడీ కట్టి భళా అనిపించుకుంది. ఖాన్ త్రయం తారల లిస్ట్లో చేరిపోయినందుకు కంగ్రాట్స్ అనుష్క.