'బ్రహ్మోత్సవం'లో నన్ను నేను చూసుకున్నా!

17 May, 2016 00:37 IST|Sakshi
'బ్రహ్మోత్సవం'లో నన్ను నేను చూసుకున్నా!

హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నట ప్రయాణం తొమ్మిదేళ్లుగా సాగుతోంది. ఎన్నో అద్భుత పాత్రల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా ఒదిగిపోయింది. కథల ఎంపికలోనూ కాజల్‌కంటూ టేస్ట్ ఉంది. ‘బ్రహ్మోత్సవం’లో మరో ఇద్దరు కథానాయికలున్నా కాజల్ నటించిందంటే నిజంగా ఆ కథలో ఏదో ఉంటుందంతే. మహేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ ఈ 20న రిలీజ్. సిన్మా గురించి కాజల్ చెప్పిన కబుర్లు..
 
‘‘బ్రహ్మోత్సవం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ప్రతి సన్నివేశం ఉత్సవంలాగే ఉంటుంది. బోలెడుమంది మనుషులు, హంగామా. మనం కూడా ఇలా ఎప్పుడూ ఇంతమంది మధ్య గడిపితే భలే ఉంటుంది కదా అన్న భావనకి గురయ్యేలా సినిమాని తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఈ కథలో నన్ను నేను చూసుకున్నా. నా కుటుంబం, మధ్య గడిపిన అపురూప క్షణాలెన్నో గుర్తుకొచ్చాయి.

సినిమాలోలా మాదీ పెద్ద కుటుంబమే. ఇంటికెళితే ఆంటీలు, అంకుల్స్, కజిన్స్... ఇలా అందర్నీ కలుస్తుంటా. ఇప్పుడు తక్కువే కానీ నా చిన్నప్పుడైతే ఏ చిన్న వేడుకైనా సరే అందరం ఒకేచోట కలుసుకొని హంగామా చేసేవాళ్లం. అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి’’.
 
కెమిస్ట్రీనే వేరు
‘‘ఈ సినిమాలో నాపాత్ర పేరు కాశీ. ఎన్నారై అమ్మాయిని. ఎన్నారై అనగానే పొగరుగా, మనవి కాని వేషభాషలతో కనిపిస్తుంటుందని అనుకుంటే పొరపాటు. ఎన్నారై అమ్మాయిలు కూడా మామూలుగా మనలాగే ఉంటారన్నట్టుగా ఈ సినిమాలో నా పాత్రని తీర్చిదిద్దారు శ్రీకాంత్. ఇంత బలమైన పాత్రని ఇదివరకెప్పుడూ నేను చేయలేదు. మహేశ్‌తో కలిసి కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తా. ఆయనతో నేను నటించడం ఇది రెండోసారి. ఇదివరకు మేం చేసిన ‘బిజినెస్ మేన్’ వచ్చి నాలుగేళ్లయింది.

మహేశ్‌లో ఏ మాత్రం మార్పులేదు. ఇప్పుడు మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. బాలా త్రిపురమణి సాంగ్ చూస్తే మహేశ్‌కి వయస్సు తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఒకసారి పనిచేసినవారితో మరోసారి నటిస్తే ఆ కెమిస్ట్రీనే వేరు. ఒకరి బాడీ లాంగ్వేజ్ మరొకరికి తెలియడంతో, నటనలోనూ టైమింగ్ కుదురుతుంది. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌తో నటిస్తున్నప్పుడు అది బాగా అర్థమైంది’’.
 
బాధ్యత పెరిగింది
‘‘తొమ్మిదేళ్లుగా కథానాయికగా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. ఆ విషయం తలచుకొన్నప్పుడంతా నాపై బాధ్యత మరింత పెరిగిందన్న విషయం గుర్తుకొస్తుంటుంది. అందుకు తగ్గట్టుగానే కథల్ని ఎంచుకుంటున్నా. సరైన సమయంలో సరైన పాత్రలు లభిస్తుండటం నా అదృష్టం. ‘బ్రహ్మోత్సవం’ నా ప్రయాణంలో మరో తీపి గుర్తు. ప్రస్తుతం తేజగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆయనతో సినిమా చేస్తుంటే మరోసారి కెరీర్ ఆరంభించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం సినిమాలపైనా దృష్టి పెడుతున్నా. తమిళంలో జీవా, విక్రమ్‌లతో సినిమాలు చేస్తున్నా. హిందీ ‘దో లఫ్జోంకి కహానీ’ కూడా త్వరలో రిలీజ్.