సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ

11 Nov, 2023 03:04 IST|Sakshi
బెల్లం దుర్గ, దేవినేని అవినాష్, ఘట్టమనేని బాబీ, కమల్‌హాసన్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్‌ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్‌.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ .

ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్‌ దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్  మోహన్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్‌సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్‌ పాల్గొన్నారు. 

గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు
‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌ చేశారు మహేశ్‌ బాబు.

మరిన్ని వార్తలు