ఇప్పటికింకా నా వయసు..!

28 Oct, 2018 11:09 IST|Sakshi

సినిమాల ఎంపికతో పాటు సెన్సేషనల్‌ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే అమలా పాల్‌ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా హీరోయిన్‌లు తమ వయసు గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ సంచలన నటి ఈ విషయంలో అసలు భయపడినట్లు లేదు. తన వయసెంతన్నది చెప్పేసింది.

మైనా చిత్రంతో కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ కేరళా కుట్టి ఆ తరువాత తమిళ సినిమానే ఎక్కువగా నమ్ముకుంది. అడపాదడపా మాతృభాషతో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లో నటిస్తున్నా, ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమనే ఈ అమ్మడిని ఆదరిస్తోంది. విజయ్‌కు జంటగా తలైవా, విక్రమ్‌తో దైవతిరుమగళ్, ధనుష్‌తో వేలైఇల్లా పట్టాదారి సిరీస్‌ వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన ఈ బ్యూటీకి ఇటీవల నటించిన రాక్షసన్‌ చిత్ర హిట్‌ నూతనోత్సాహాన్నిచ్చిందనే చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆడై, అదో అంద పరవై బోల చిత్రాల్లో నటిస్తోంది. అమలాపాల్‌ శుక్రవారం పుట్టిన రోజును జరుపుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షల వర్షం కురిపించారు. అభిమానుల శుభాకాంక్షలకు తబ్బిబ్బైన ఈ ముద్దుగుమ్మ తానిప్పుడు 27వ ఏట అడుగు పెట్టానని సంతోషంలో నిజం చెప్పేసింది. అంతేకాదు ఇంత తక్కువ వయసులోనే నటిగా ఇంత పేరు సంపాదించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది.

ఉదయం 5 గంటలకు నిద్ర లేచి సైక్లింగ్‌తో తన దిన చర్య ప్రారంభం అవుతుందని చెప్పింది.  ఆ తరువాత యోగశాలకు వెళతానని, అక్కడక్కడ ఎంతో పరవశంతో శ్వాశిస్తానని, అలా తన పుట్టిన రోజును సంతోషంగా ప్రారంభించానని పేర్కొంది. మొత్తం మీద తన వయసిప్పుడు 27 ఏళ్లే అని ఎవరికి చెప్పే ప్రయత్నం చేసిందీ అమ్మడు? ఆ జాణ రెండో పెళ్లి గురించి సోషల్‌ మీడియాల్లో చాలా కాలంగానే వైరల్‌ అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా తన వయసు గురించి చెప్పాలనుకుందా అనే గుస గుసలు కోలీవుడ్‌లో మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు