మీడియాపై అమలాపాల్‌ విసుర్లు

3 Nov, 2017 06:49 IST|Sakshi

తమిళసినిమా: మీడియాపై నటి అమలాపాల్‌ నిప్పులు చెరిగింది .ఇటీవల తన కారు కొనుగోలుపై పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అమలాపాల్‌ బెంగళూర్‌లో ఖరీదైన కారును కొనుగోలు చేసి దాని రిజిస్ట్రేషన్‌ను పుదుచ్చేరిలో నకిలీ చిరునామాతో చేసుకుని మోసానికి పాల్పడిందన్న ప్రచారం హోరెత్తింది. ఈ వ్యవహారంపై నటి అమలాపాల్‌ గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో జాతీయ లక్ష్యాలతో మలబార్‌ ప్రాంతంలో స్వాతంత్య్ర పోరాట వీరుల చేత ప్రారంభించబడ్డ ఒక ప్రాచీన దిన పత్రిక సాధారణ ప్రజల దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి, తద్వారా తన రీడర్‌ షిప్‌ను పెంచుకోవడానికి ఆసత్య ప్రచారాలకు పాల్పడడం తనకు వేదన కలిగించిందని తెలిపింది. నటిగా తాను ఏడాదికి రూ.కోటికి పైగా పన్నును చెల్లిస్తున్నానని చెప్పింది.

అలాంటిది సంబంధిత శాఖాధికారులు ఎలాంటి అవకతవకలు తెలుసుకోకుండానే తనపైనా, తన కుటుంబంపైనా నిరాధార ఆరోపణల రాతలు రాస్తూ వేదనకు గురిచేయడంతో తాను మాట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక భారత పౌరురాలిగా తాను ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవచ్చునని, ఆస్తులు కొనుగోలు చేసుకునే హక్కు ఉన్నదని పేర్కొంది. మాతృదేశం అన్న పదానికి నిజమైన అర్థాన్ని మరిచి కొందరు ప్రాంతీయ వాదనలను లేవనెత్తడంతో పాటు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. తమిళ్, మలయాళం భాషల్లో సమానంగా నటిస్తున్న తాను ఇరు రాష్ట్రాల్లోనూ ఆదాయాన్ని, ఆస్తులను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను తీసుకోవాలని భావించానంది. ఒక వేళ తాను తెలుగు చిత్రాల్లో నటించడానికి, బెంగళూర్‌లో స్థిరాస్తులు కొనుక్కోవడానికి ఇలాంటి వారి అనుమతి పొందాలేమోనని ఎద్దేవా చేసింది.

మరిన్ని వార్తలు