లగ్జరీ కార్లకు పండుగ జోష్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాల జోరు

21 Nov, 2023 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్‌ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్‌ఫోలియో, బలమైన కస్టమర్‌ సెంటిమెంట్‌ ఈ జోష్‌కు కారణమని మెర్సిడెస్‌–బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

దసరా, ధన్‌తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్‌లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్‌ 14 మధ్య మొత్తం ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి.  

ఏడేళ్లలో గరిష్టం.. 
ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్‌ బుక్‌తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్‌ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్‌లో నమోదు చేశామన్నారు.

ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5, ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్‌ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్‌ చెప్పారు. పండుగల సీజన్‌లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ల నుండి కూడా మంచి డిమాండ్‌ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు.  

2027 నాటికి 1.54 బిలియన్‌ డాలర్లు.. 
పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు.

‘2021లో భారతీయ లగ్జరీ కార్‌ మార్కెట్‌ విలువ 1.06 బిలియన్‌ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్‌ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆటోమొబైల్‌ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్‌ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. 

మరిన్ని వార్తలు