అమితాబ్ అసూయ!

27 Jun, 2013 05:58 IST|Sakshi
అమితాబ్ అసూయ!

 బంగారంలాంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఆ అవకాశం తమకెందుకు దక్కలేదా? అని ఫీలైపోతుంటారు. ప్రస్తుతం బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పరిస్థితి అదే. అమితాబ్ అంతలా బాధ పడటానికి కారణం ఇటీవల విడుదలైన ‘రాన్‌జనా’ చిత్రం. ధనుష్, సోనమ్‌కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వాళ్లూ వీళ్లూ అని కాకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ చిత్రం అమితాబ్‌కి కూడా తెగ నచ్చేసింది. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో నటించే అవ కాశం రానందుకు అసూయగా ఉందని పేర్కొన్నారాయన. అయితే ఆ అసూయను పక్కన పెట్టి ఈ చిత్రం యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. నటీనటుల అభినయ ప్రదర్శన, దర్శకుడి ఆలోచనా విధానంపై అమితాబ్ ‘ట్విట్టర్’లో ప్రశంసల వర్షం కురిపించారు. ఛాంపి యన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన తర్వాత తాను ‘రాన్‌జనా’ చిత్రాన్ని చూశానని, ధనుష్, సోనమ్ కపూర్‌ల నటన ఆకట్టుకుందని అమితాబ్ పోస్ట్ చేశారు. గతవారం విడుదలైన ‘రాన్‌జనా’ చిత్రం ఇప్పటికే విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ చిత్రం ‘అంబికాపతి’ పేరుతో జూన్ 28న తమిళంలో విడుదలకు సిద్దమవుతోంది.

>