మహోన్నతుడు అక్కినేని

15 Nov, 2019 05:33 IST|Sakshi
టి. సుబ్బరామిరెడ్డి, నాగార్జున

– టి. సుబ్బరామిరెడ్డి

‘‘అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నతమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు(ఏయన్నార్‌). అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేం. ఆయన పేరిట నెలకొల్పిన ‘ఏయన్నార్‌ జాతీయ అవార్డు’ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డు గ్రహీతలు అదృష్టవంతులు’’ అని ‘ఏయన్నార్‌ జాతీయ అవార్డు కమిటీ చైర్మన్‌’, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకుగానూ ఏయన్నార్‌ జాతీయ అవార్డు గ్రహీతల పేర్లను హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరామిరెడ్డి  వెల్లడించారు.

ఏయన్నార్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు 2018కి దివంగత ప్రముఖ నటి శ్రీదేవికి, 2019కి నటి రేఖలను ఎంపికచేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘నాకు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారు పిలిచి ‘ఏయన్నార్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు’ను స్థాపించి, అవార్డులు ఇవ్వాలనే ఆలోచన గురించి చెప్పారు. తాను ఉన్నా లేకున్నా తన వారసుల చేత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూనే ఉండాలన్నారు.

అలా 2006లో ‘ఏయన్నార్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు’ను స్థాపించి, తొలిసారి నటుడు దేవానంద్‌కు ఇచ్చాం. 2017లో దర్శకుడు రాజమౌళికి ఇచ్చాం. నటీమణులుగా శ్రీదేవి, రేఖ జాతీయస్థాయిలులో కీర్తి గడించారు. అందరూ గర్వించే గొప్ప నటి శ్రీదేవికి ఈ అవార్డు ఇవ్వాలనేది నాగేశ్వరరావుగారి కోరిక కూడా. అందుకే 2018 అవార్డును శ్రీదేవికి ఇస్తున్నాం. తండ్రి ఆలోచనలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్న నాగార్జునగారిని అభినందిస్తున్నాను’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు’ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది.

నాన్నగారి(ఏయన్నార్‌) పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును ప్రదానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా నాన్నగారికి సుబ్బరామిరెడ్డిగారు ఎంత సన్నిహితులో, నాకూ అంతే సన్నిహితులు. ఈ అవార్డు కమిటీ బోర్డ్‌ చైర్మన్‌గా ఆయన ఉండాలి అనేది నాన్నగారి కోరిక. శ్రీదేవి తరపున ఈ అవార్డును ఆమె భర్త బోనీకపూర్, కుటుంబ సభ్యులు తీసుకుంటారు. రేఖగారికి ఈ అవార్డు గురించి చెప్పగానే చాలా సంతోపడ్డారు. నాన్నగారితో మంచి అనుబంధం ఉందని, ఆయన దగ్గర నటనకు సంబంధించిన సలహాలు తీసుకున్నట్లు చెప్పారామె. అవార్డు గ్రహీతలకు ఐదు లక్షల నగదు బహుమతి అందజేస్తాం. ఈ కార్యక్రమంలో ‘అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా’ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు రేఖగారు సర్టిఫికెట్లు అందజేస్తారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు