-

నా భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా!

25 Jan, 2016 19:50 IST|Sakshi

- సచిన్, రేఖా లాంటివాళ్లు టైమ్ పాస్ ఎంపీలు
- అసహనంపై బాలీవుడ్ ప్రముఖులవి పిల్లకూతలు
- జైపూర్ లిటరరీ ఫెస్టివల్ వేదికగా బీజేపీ ఎంపీ శత్రుఘ్నాసిన్హా సంచలన వ్యాఖ్యలు
- జీవితచరిత్ర పుస్తకం 'ఎనీథింగ్ బట్ ఖామోష్' విడుదల చేసిన వెటరన్ యాక్టర్



జైపూర్: 'ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? అనేది ప్రశ్నేకాదు. ఎవర్ని చేసుకోకుండా ఉండాలి? అనే ఆలోచించేవాణ్ని. బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది అప్పట్లో అమ్మాయిలకు నేనంటే ఎంత క్రేజో! తెరమీద సూపర్ జోడీగా పేరున్నట్లే తెర వెనుక కూడా ఓ హీరోయిన్ తో నా బంధం కొనసాగింది.. పూనంతో పెళ్లైన తర్వాత కూడా! అయితే ఒక్కసారితప్ప నేను నా భార్యను ఎప్పుడూ మోసం చేయలేదు. రెడ్ హ్యాండెడ్ అంటారే అలా ఓ సారి దొరికిపోయి, క్షమాపణలు చెప్పుకున్నతర్వాత మా మధ్య మళ్లీ మనస్పర్థలు రాలేదంటే నమ్మండి' అంటూ తన వివాహేతర సంబంధాలను పూసగుచ్చినట్లు వివరించారు బాలీవుడ్ వెటరన్ యాక్టర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా.

'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరుతో రాసిన తన జీవితచరిత్ర పుస్తకాన్ని జయపూర్ లిటరరీ ఫెస్టివల్ లో సోమవారం విడుదలచేశారాయన. ఈ సందర్భంగా పుస్తకంలోని విషయాలతోపాటు సభికులు అడిగిన ప్రశ్నలకు షాట్ గన్ సమాధానాలిచ్చారు. బీజేపీ సీనియర్లు ఎల్ కే అద్వానీ, యశ్వంత్ సిన్హా సహా శత్రుఘ్నా తనయ సోనాక్షి పుస్తకావిష్కరణ వేదికపై ఆసీనులయ్యారు.

రాజ్యసభలో సచిన్, రేఖా లాంటి కొందరు ప్రముఖుల గైర్హాజరుపై ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ.. 'నా దృష్టిలో సచిన్ టెండూల్కర్, రేఖా లాంటివాళ్లు టైమ్ పాస్ ఎంపీలు. వీళ్లు చర్చల్లో పాల్గొనరు. అసలు సభకే రారు. నాకే గనుక ఎంపికచేసే అవకాశం ఉంటే కచ్చితంగా ఇలాంటివాళ్లను మాత్రం ఎంపికచేయను. ప్రముఖులకు చోటు కల్పిస్తే రాజ్యసభ గౌరవం పెరుగుతుందని భావిస్తాం కానీ అలా ఎన్నటికీ జరగదు' అని తూటాల్లాంటి మాటలు పేల్చారు సిన్హా.

ఇటీవల బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరు అసహనంపై చేసిన వ్యాఖ్యలను పిల్లకూతలు(చైల్డిష్ కామెంట్స్)గా అభివర్ణించిన శత్రుఘ్నా సినీరంగంలో సక్సెస్ నే తప్ప టోలరెన్స్, ఇన్ టోలరెన్స్ లాంటివి పట్టించుకోరన్నారు. మెమన్ ఊరితీతను ఆపాల్సిందిగా తాను రాష్ట్రపతికి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతున్న యువతకు తన జీవితచరిత్ర పుస్తకం ప్రేరణిస్తుందని, దాని వెనుక 10ఏళ్ల కష్టం దాగుందని సిన్హా చెప్పుకొచ్చారు. ఆయన జీవిత చరిత్ర 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పుస్తకాన్ని భారతీ ప్రధాన్ రచించారు.