పుణెలో ఘోరం.. బర్త్‌డేకు దుబాయ్‌ తీసుకెళ్లలేదని భర్తపై భార్య దాడి, మృతి

25 Nov, 2023 10:59 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు దుబాయ్‌కు తీసుకెళ్లలేదని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడికి దిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విచిత్ర ఉదంతం పుణెలో శుక్రవారం వెలుగుచూసింది.

వివరాలు.. వానావ్డీ ప్రాంతంలోని రెసిడెన్షియల్‌ సొసైటీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో 36 ఏళ్ల నిఖిల్‌ ఖన్నా, తన భార్య రేణుక(33)తో కలిసి జీవిస్తున్నాడు. వీరు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. నిఖిల్‌ నిర్మాణ రంగంలో వ్యాపారిగా పనిచేస్తున్నారు.

ఇటీవల రేణుక బర్త్‌డే జరగ్గా.. ఆ వేడుకలను జరుపుకునేందుకు దుబాయ్‌ వెళ్దామని శుక్రవారం మధ్యహ్నాం తన భర్త నిఖిల్‌ను అడిగింది. ఇందుకు అతడు నిరాకరించాడు. పుట్టినరోజు, పెళ్లి రోజు నిఖిల్‌ తన భార్యకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది. కనీసం కొంతమంది బంధువులతో అయినా ఢిల్లీ వెళ్లి సెలబ్రేట్‌ చేసుకుందని తన భర్తను కోరినప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందర రాలేదు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ ఆవేశంలో నిఖిల్‌ ముఖంపై రేణుక గట్టిగా కొట్టింది. దీంతో నిఖిల్‌ ముక్కుకు గాయమైంది, అతని పళ్లు కూడా కొన్ని విరిగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేణుకను అదుపులికి తీసుకొని విచారిస్తున్నారు.
చదవండి: పెళ్లై 11 ఏళ్లు, పిల్లలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం

మరిన్ని వార్తలు