మంచి చేసే మాస్టర్‌

11 Nov, 2018 02:35 IST|Sakshi
శివలెంక కృష్ణప్రసాద్, గోపి, సత్యదేవ్‌

‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్‌ మాస్టర్‌’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్‌ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్‌’ వంశీ, ‘దిల్‌’ రమేశ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌ మాస్టర్‌’. గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో రమేష్‌.పి.పిళ్లై నిర్మించారు.

శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్‌ మాస్టర్‌’ కథకు సత్యదేవ్‌ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్‌ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్‌ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు.

మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్‌ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్‌ అయ్యాను. నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్‌. సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్, సినిమాటోగ్రాఫర్‌ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్‌. వినోద్, అడిషనల్‌ డైలాగ్స్‌: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.కృష్ణకుమార్‌ (కిట్టు).

మరిన్ని వార్తలు