సావిత్రిని చూడాలనిపించింది...

4 Oct, 2017 19:14 IST|Sakshi

సమయం లేదు మిత్రమా... శరణమా..? రణమా..?’ ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా అందని నోటి నుంచి వెలువడుతున్న డైలాగ్‌ ఇది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోని ఈ డైలాగ్‌ సాయిమాధవ్‌ బుర్రా కలం నుంచి వెలువడింది.  ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ నుంచి ఇటీవలి ‘ఖైదీ నంబర్‌ 150’ వరకు ఎన్నో విలక్షణ సినిమాలకు ఆయన రాసిన సంభాషణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ‘మహానటి’ సినిమాకు ఆయనే సంభాషణలు సమకూరుస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మహానటి సావిత్రి జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ సినిమాకు పనిచేయటం గొప్ప అవకాశంగా ఆ మాటల రచయిత భావిస్తున్నారు. తెనాలిలో జరుగుతున్న సురభి నాటకోత్సవాలకు వచ్చిన సాయిమాధవ్‌ ‘సాక్షి’తో ఆ విశేషాలను పంచుకున్నారు.   

ఇండస్ట్రీలోనే బిగ్‌ కాస్టింగ్‌...
సావిత్రి జీవిత చరిత్రపై ‘మహానటి’ టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ జరుపుకొంటోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. చాలా మంది కన్నా భిన్నమైన దర్శకుడు. ఆలోచనా విధానం గొప్పగా ఉంది. ఏదో సినిమా తీసేద్దాం... గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుందాం అనుకునే తొందర ఆయనలో కనపడదు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే ఆ విషయం అర్థమైంది. సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్, విజయా వారి నిర్మాత, రచయిత చక్రపాణిగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు. ఎన్టీయార్, ఏఎన్నార్‌ పాత్రలకు కూడా ఫైనలైతే ఇండస్ట్రీలోనే బిగ్‌ కాస్టింగ్‌ అవుతుంది. చాలా ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇది.

మాటలు రాస్తుంటే కన్నీళ్లొచ్చాయి...
సావిత్రి, చక్రపాణి, ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, జమున, భానుమతి...ఇలా ఇండస్ట్రీలో ఒకనాటి ప్రముఖుల పాత్రలకు మాటలు రాసే అవకాశం ‘మహానటి’తో లభించడం నా అదృష్టం. ఆ రోజుల్లోకి వెళ్లిపోవడం, రాయడం... గొప్పగా ఉంది. కొన్ని మాటలు రాస్తుంటే కన్నీళ్లు వచ్చేశాయి నాకు. చాలాసార్లు ఆ కన్నీళ్లు రాసే పేపరుపై పడ్డాయి. చిన్నప్పట్నుంచీ పాత సినిమాలు విపరీతంగా చూసేవాడ్ని, వెండితెరపై ప్రకాశించిన తారామణుల గురించి కథలుగా విన్నవాణ్ణి కావటం ప్లస్సయింది. ఇప్పటికీ ఆ సినిమా టాపిక్‌ వస్తే చాలు... రాసేటప్పటి నా అనుభూతులన్నీ మనసునిండా పరుచుకుంటున్నాయి.

సావిత్రి జీవితం ‘పరిపూర్ణం...!’
జీవితంలో రకరకాల సంఘర్షణలు పడిన మహిళలు, సెలబ్రిటీలున్నారు. సినిమా చరిత్రలో భగవంతుడిచ్చిన ప్రతి ఎమోషన్‌నీ సంపూర్ణంగా అనుభవించిన ఏకైక వ్యక్తి సావిత్రి. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించడం, మోసపోతే పూర్తిగా మోసపోవడం, అసహ్యించుకున్నా, అమాయకంగా నమ్మినా అదేరీతి. అలవిమాలిన కీర్తిప్రతిష్టలు సాధించడం, ఏమీ లేదన్నట్టుగా నేలమీదకు రావడం, చివరకు పూర్తిగా చచ్చిపోవటం...ఆమెకే చెల్లింది. పూర్తిగా చచ్చిపోవటమంటే, ఏమీ లేకుండా సావిత్రిగారు చనిపోయినప్పుడు చూస్తే తెలుస్తుంది. శరీరబరువు కూడా సుమా! పుట్టినప్పుడు ఎంత బరువుందో, పోయేటప్పుడు కాస్త అటూఇటూగా అంతే ఉన్నారామె! జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించటమంటే ఇంత పరిపూర్ణంగానా అనిపిస్తుంది.

 

సావిత్రిని చూడాలనిపించింది..
నటీమణులెందరో ఉన్నారు. సావిత్రి వేరు. చక్కని ముఖవర్చస్సు, భావాలను అలవోకగా చెప్పగలిగిన అందమైన కళ్లు... ఒక నటికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. జీవితంలో విఫలమయ్యారని, వైవాహిక జీవితం దెబ్బతిందని, మద్యానికి బానిసైందనీ... అందరికీ తెలిసినట్టుగా నాకూ అంతవరకే తెలుసు. ఎప్పుడైతే ఆమె చరిత్రలోకి వెళ్లామో? జీవితాన్ని పట్టుకున్నామో? ‘సావిత్రి మరోసారి కనిపిస్తే బాగుండును... ‘అందరిలా ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు?’ అని అడగాలనిపించింది. రేపు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికీ కచ్చితంగా అలాగే అనిపిస్తుంది. జెమినీ గణేశన్‌ది టిపికల్‌ పాత్ర. సావిత్రిని అభిమానించేవారు ఆయన్నో విలన్‌గానే భావిస్తారు. వాస్తవంలోకి వెళితే ఆయనపై కోపం రాదు. అంతగా నమ్మడం ఆమె పొరపాటేమో? అనిపిస్తుంది.

విభిన్న సినిమాలకు వైవిధ్యంగా...
చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, ఆయన 150వ సినిమాకు నేనే డైలాగులు రాశాను. తొలి స్వాతంత్య్రయోధుడి చరిత్ర అది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌తో మరో సినిమా ఉంది. ‘జిల్‌’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తుంది. ఒక ఫిక్షన్‌లా, ఏమోషన్‌ థ్రిల్లర్‌లా అనిపిస్తూ అన్నిరకాల షేడ్స్‌ కనిపిస్తాయి. మహేష్‌బాబు సోదరి మంజుల తొలిసారిగా దర్శకత్వం చేపడుతున్న ప్రేమకథాచిత్రానికి రాస్తున్నా. సందీప్‌కిషన్‌ హీరో. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా వస్తున్న ‘సాక్ష్యం’ సినిమా కూడా ఉంది. విభిన్న కథాంశాలతో సినిమాలు రావటంతో అంతే వైవిధ్యంగా సంభాషణలు రాసే ప్రయత్నం చేస్తున్నాను. మంచి పేరు తెస్తాయని భావిస్తున్నా. అంతా సాయిబాబా దయ. 

మరిన్ని వార్తలు