క్యాథరిన్‌ హై క్యా?

1 Dec, 2018 00:32 IST|Sakshi
రామ్‌చరణ్‌, క్యాథరిన్‌

రామ్‌చరణ్‌ స్టెప్పేస్తే ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా మాస్‌ సాంగ్స్‌కైతే అదుర్స్‌. ఇప్పుడు రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న  ‘వినయ విధేయ రామ’లో ఓ మంచి మాస్‌ మసాలా సాంగ్‌ ఉందట. రెండు పాటలు మినహా ఈ చిత్రం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సాంగ్స్‌లో ఒకటి ఫ్యామిలీ సాంగ్‌ కాగా, మరొకటి స్పెషల్‌ మాస్‌ సాంగ్‌. ఈ స్పెషల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేయడానికి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ చాన్స్‌ క్యాథరిన్‌కు దక్కిందని టాక్‌. మరి.. క్యాథరిన్‌ హై క్యా (క్యాథరిన్‌ ఉందా?) అనేది త్వరలో తెలుస్తుంది. అలాగే కేవలం స్పెషల్‌సాంగ్‌ కోసమే అన్నట్లు క్యాథరిన్‌ క్యారెక్టర్‌ ఉండదట.

ఓ సీన్‌లో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ మాదిరిగా ఉంటూ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో రామ్‌చరణ్‌తో కలిసి కాలు కదుపుతారట ఆమె. ‘వినయ విధేయ రామ’ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా, ‘జయజానకి నాయక’ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేశారు క్యాథరీన్‌. వచ్చే నెల రెండో వారం తర్వాత ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, వివేక్‌ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు