బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యం అవుతుందా..?

12 Dec, 2015 13:45 IST|Sakshi
బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యం అవుతుందా..?

తమిళనాట సామాన్య ప్రజానీకంతో పాటు సినీ రంగాన్ని కూడా వరదలు ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా సినీరంగానికి సంబంధించిన ఎడిటింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ స్టూడియోలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు తెలుగు ఇండస్ట్రీకి కూడా తప్పటం లేదు. తెలుగు సినిమాలకు పనిచేసే చాలా మంది సాంకేతిక నిపుణులకు చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ స్టూడియో చెన్నై వరదల్లో పూర్తిగా దెబ్బతింది. దీంతో డిక్టేటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంజనీర్లు తమన్ స్టూడియోను బాగుచేసే పనిలో ఉన్నా ఆ పనులు పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

తమన్ స్టూడియో అందుబాటులోకి రాని పక్షంలో మణిశర్మ లేదా చిన్నాతో రీ రికార్డింగ్, డిటియస్ వర్క్స్ పూర్తి చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. వీటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న మరికొంత సమయం పడుతుంది కాబట్టి అనుకున్నట్టుగా డిక్టేటర్ సంక్రాంతి రిలీజ్ చేయటం వీలౌతుందా..లేదా..?  అనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.