నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

27 Nov, 2019 18:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద వైరల్‌ అవుతున్న తన ఫోటోపై వివరణ ఇచ్చారు. అది మార్ఫింగ్‌ ఫోటో అని ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. ఇటీవల, లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన వివాదాస్పద గురువు నిత్యానందతో  చిన్మయి, ఆమె తల్లి కలిసి  ఉన్న ఒక  ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోను వివరీతంగా షేర్‌ చేసిన నెటిజనులు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు.  దీంతో స్పందించక తప్పని పరిస్థితుల్లో ఈ  ఫోటోపై వివరణ ఇచ్చారు. అయినా షేరింగ్స్‌ ఆగలేదు. ఈ ఫోటో నకిలీదని నిర్ధారించిన తర్వాత ఈ అభిమానులు మరలా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ట్వీట్‌ చేశారు. కావాలనే ఇలా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు ఫోటోను షేర్‌ చేశారు.  అయితే చిన్మయి ట్వీట్ తరువాత, మార్ఫింగ్ ఫోటో  షేర్‌  చేసిన ట్విటర్‌ యూజర్‌ తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం.

తన నలుగురు కుమార్తెలను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్ధంగా నిర్బంధించి, వేధింపులకు గురిచేశారంటూ ఒక కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో  ‘సేవ్‌ గరల్స్ ఫ్రమ్‌ నిత్యానంద’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో విపరీతంగా ట్రెండ్‌ అయింది. సాధారణంగా ఇలాంటి సమస్యలపై తరచుగా స్పందించే చిన్మయి ఈ సమస్యపై కూడా స్పందించారు. మతపరమైన స్వాములు, భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమాలుఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నా..ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనేదానిపై పదేపదే ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రజలు అర్థం చేసుకోలేక  వారి  మాయలో పడిపోతున్నారని  చిన్మయి ట్వీట్‌ చేశారు. దీనిక ప్రతిగా స్పందించిన ఒక వినియోగదారుడు నిత్యానంద నుంచి  చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్టుగా  ఉన్న ఒక  ఫేక్‌ ఫోటో షేర్‌ చేయడంతో దుమారం రేగింది. 

తమిళం, తెలుగుతోపాటు అనేక ఇతర భాషలలో పలు సూపర్‌ హిట్‌ పాటలతో చిన్మయి ప్రాచుర్యం పొందారు. అంతేకాదు  త్రిష, సమంతా వంటి టాప్‌ హీరోయిన్లకు తన గొంతు అరువిచ్చి ఆయా పాత్రలకు ప్రాణం పోసారు.  దీనితోపాటు తమిళ  చిత్ర పరిశ్రమలో మీ టూ ఉద్యమంలో చిన్మయి పాత్ర  చాలా చురుకైనది.

 చదవండి : ‘నా కుమార్తెను చంపేశారు’: నిత్యానంద మరో అకృత్యం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు