నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు : చిరంజీవి

12 Feb, 2019 13:06 IST|Sakshi

అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం మరణించిన సీనియర్‌ దర్శకులు విజయ బాపినీడుకు మెగాస్టార్‌ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపినీడుతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన అభిమానులకు కూడా విజయ బాపినీడు అంటే ఎంతో ఇష్టం మన్న చిరు, తన కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆయన తమ్ముడిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

‘నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆయన గెస్ట్ హౌస్ ను నాకు ఇచ్చారు. పై ఫ్లోర్ లో ఉండే వారిని కిందకు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. ఎప్పుడూ నా పై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్ ఉన్నాయి.

‘ఒకరోజు ‘మగమహారాజు’ 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే... ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటంటీ... దీనిని నేను ఏం చేసుకోనూ! అంటే... ‘మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను’ అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన.

అలానే గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ ను ఒకే రోజు నాలుగు సిటీస్ లో గ్రాండ్‌గా జరిపించిన అరుదైన రికార్డ్ మా ఇద్దరి కాంబినేషన్ లో ఉంది. ఆయన ఏం చేసినా... చాలా వినూత్నంగా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. దానికి కారణంగా చిరంజీవి అనే మ్యాగజైన్‌ను ఆయన పబ్లిషర్‌గా, ఎడిటర్‌గా తీసుకొచ్చారు. అందులో నాకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారు.

విజయ బాపినీడు దర్శకుడి ఎదుగుతున్న సమయంలో చిరంజీవి హీరోగా పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, హీరో, మహానగరంలో మాయగాడు లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తరువాత చిరు కెరీర్‌ను మలుపు తిప్పి, మెగాస్టార్‌గా మార్చిన ఖైదీ నంబర్‌ 786, గ్యాంగ్‌ లీడర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కూడా ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. 1995లో రిలీజ్‌ అయిన ‘బిగ్‌బాస్‌’ చిరంజీవి, బాపినీడు కాంబినేషన్‌లో తెరకెక్కిన చివరి చిత్రం.

మరిన్ని వార్తలు