శాండల్‌వుడ్‌కు సినిమా కష్టాలు

5 May, 2019 15:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  ఎంతో కష్టపడి పదే పదే సినిమాలను నిర్మిస్తున్నప్పటికీ అవి బాక్సాఫీసు వద్ద చతికిలపడుతుంటే నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.  ఇక కొత్త చిత్రాలను నిర్మించేది ఎలా అంటూ ఉసూరుమంటున్నారు. దీంతో శాండల్‌వుడ్‌ పురోగమనం ఎలా సాధ్యమని సినీ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తన మార్కెట్‌ను పెంచుకోవాలని శాండల్‌వుడ్‌ఒకవైపు ప్రయత్నాలు సాగుతున్న వేళ వరుస పరాజయాలు సినీరంగాన్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి.  

నాలుగు నెలలను పరికిస్తే  
గత నాలుగు నెలల్లో సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో మొత్తం 66 సినిమాలు విడుదలయ్యాయి. నిర్మాతలకు దక్కింది మాత్రమే రూ. 70 కోట్లేనని పలువురు సినీ నిపుణులు లెక్కలు గట్టారు. సుమారు రూ. 230 కోట్ల మేర నష్టాలను నిర్మాతలు మూటకట్టుకున్నారు. ఇందులో విజయవంతమైన చిత్రాల సంఖ్య 10 కూడా దాటలేదు. 66 సినిమాల్లోకి కేవలం 5 చిత్రాలు మాత్రమే నిర్మాతలకు సంతోషం పంచాయి.  

ఇతర రంగాలవైపు నిర్మాతల చూపు  
కోట్లాది రూపాయలను నష్టపోవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం పెట్టుబడి కూడా రాకుంటే ఇక ఎలా సినిమాలు నిర్మించాలని వాపోతున్నారు. దీంతో సినిమాలు ఇక చాలని ఇతర వ్యాపార రంగాలపై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది విడుదలయిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గతేడాది ఇదే ఏప్రిల్‌ నాటికి 75 చిత్రాలు విడుదల కాగా, ఈ ఏడాది 20 శాతం తక్కువగా 66 సినిమాలు నిర్మితమయ్యాయి. ఇక నిర్మాణంలో ఉన్న సగానికి పైగా> సినిమాల్లో విడుదలకు నోచుకునేవెన్ని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

స్టార్‌ హీరోల సహాయహస్తం
ఇలాంటి విపత్కర సమయంలో శాండల్‌వుడ్‌ను కాపాడేందుకు స్టార్‌ నటులు నడుం బిగించారు. తమకు తోచిన విధంగా కొత్త చిత్రాలను ప్రమోట్‌ చేయడం, వాటి టీజర్లను విడుదల చేయడం, ఆడియోలాంచ్‌లకు హాజరు కావడం, ఇంకా సోషల్‌మీడియాలో వాటి గురించి చర్చిస్తూ సినిమా పరిశ్రమలో ఉత్సాహం నింపే యత్నాలు చేస్తున్నారు. స్టార్‌ నటులు దర్శన్, సుదీప్, పునీత్‌ రాజ్‌కుమార్, యశ్, గణేశ్, శ్రీమురళి వంటి వారు కొత్త చిత్రాలకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు