నిర్మాతగా ఎన్టీఆర్‌కి వజ్రోత్సవం

17 Jul, 2013 01:25 IST|Sakshi
నిర్మాతగా ఎన్టీఆర్‌కి వజ్రోత్సవం

అప్పటికి ఎన్టీఆర్ హీరో అయ్యి నాలుగేళ్లయ్యింది. 16 సినిమాలు చేశారు. పాతాళభైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు లాంటి విజయవంతమైన సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. నిర్మాతలు ఆయన కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ‘నేషనల్ ఆర్ట్స్’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ పెడుతున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలో చాలామంది ఖంగు తిన్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌కి సొంత బేనర్ అవసరమా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. తనకొచ్చే ఆఫర్లన్నీ కమర్షియల్ సినిమాలే. కొంచెం విలువలతో కూడిన కళాత్మక చిత్రాల్లో చేయాలని ఆయనకు మనసులో కోరిక ఉంది.
 
 అలాగని బయటి నిర్మాతలను చేయమనడం కరెక్ట్ కాదు. ఆ రిస్కేదో తానే చేద్దామనుకునే ఇలా సొంతంగా బేనర్ పెట్టుకున్నారు. అందులో తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు మేనేజింగ్ పార్టనర్. దగ్గరి బంధువు దోనేపూడి కృష్ణమూర్తి పార్టనర్. ఒకప్పటి తన రూమ్మేట్ తాతినేని ప్రకాశరావుకు డెరైక్షన్ బాధ్యతలు అప్పగించారు. ఫేస్ వేల్యూ, స్టార్ వేల్యూ ఉన్న ఎన్టీఆర్ పక్కా స్టోరీ వేల్యూతో ‘పిచ్చి పుల్లయ్య’ మొదలు పెట్టారు. కృష్ణకుమారి, షావుకారు జానకి, గుమ్మడి, అమర్‌నాథ్ లాంటి వాళ్లు యాక్ట్ చేశారు. టీవీ రాజు మ్యూజిక్. 1953 జూలై 17న ‘పిచ్చి పుల్లయ్య’ విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 60 ఏళ్లన్నమాట. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ కలల్ని పండించలేదు. విమర్శకుల ప్రశంసలతో మనసు నిండింది కానీ, గల్లా పెట్టె మాత్రం నిండలేదు.
 
 అయినా ఎన్టీఆర్ తగ్గలేదు. ఈసారి కూడా అదే ధోరణిలో ‘తోడు దొంగలు’ తీశారు. బేనర్ పేరు కూడా ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ అని మార్చారు. కానీ ఫేట్ మారలేదు. సేమ్ సీన్ రిపీట్. అయినా ఎన్టీఆర్ బాధపడలేదు. భయపడలేదు. జనం అభిరుచి ఇలా ఉందన్నమాట అని విశ్లేషించుకున్నారు. వాళ్లకు కావాల్సిందే ఇస్తే పోలా అని నిశ్చయించు కున్నారు. అలా ‘జయసింహ’ సినిమా పుట్టింది. ఫక్తు జానపదం. సినిమా సూపర్‌హిట్. ఆ తర్వాత ‘పాండురంగ మహాత్మ్యం’ తీస్తే అదో క్లాసిక్ అయ్యి కూర్చుంది.
 
  ‘సీతారామ కల్యాణం’ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. రావణాసురుణ్ణి హీరోగా చూపించిన ఈ సినిమా ఎన్టీఆర్‌ని పై అంతస్తులో కూర్చోబెట్టింది. అటుపై ‘‘గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం, శ్రీకృష్ణసత్య, తాతమ్మకల, వేములవాడ భీమకవి, దానవీర శూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్-సలీం- అనార్కలి, డ్రైవర్ రాముడు, చండశాసనుడు, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర...’’ ఇలా ఒకదాన్ని మించి ఒకటి తీశారు. కంటెంట్ పరంగానూ, సక్సెస్ పరంగానూ అన్నీ నాణ్యమైన సినిమాలే.
 
 ఎన్‌ఏటి... రామకృష్ణ ఎన్‌ఏటి... ఎన్టీఆర్ ఎస్టేట్స్... రామకృష్ణ హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్... ఇలా సంస్థ పేర్లు ఎన్ని మారినా ఎన్టీఆర్ కళాత్మక ఆదర్శం వీసమెత్తు కూడా మారలేదు. హీరోగా, దర్శకునిగా ఎంత ఎత్తుకు ఎదిగారో, నిర్మాతగా కూడా అదే ప్రాభవాన్ని కనబరిచారు. ముఖ్యంగా ఈ సంస్థలో ఆయన చేసిన ప్రయోగాలు, ఎన్నుకున్న కథాంశాలు, కొత్త వాళ్లను ప్రోత్సహించిన తీరు, నిర్మాణ శైలి, సంగీతం మీద శ్రద్ధ... ఇవన్నీ భావితరాలకు కచ్చితంగా పెద్ద బాలశిక్షలా ఉపయోగపడతాయి. వహీదా రెహమాన్, బి.సరోజాదేవి, గీతాంజలి, నాగరత్నం, కేఆర్ విజయ లాంటి కథానాయికలంతా అభినయ అక్షరాభ్యాసం చేసింది ఎన్టీఆర్ సంస్థలోనే.
 
  చివరకు హరికృష్ణ, బాలకృష్ణల అరంగేట్రానికి కూడా ఈ సంస్థే వేదిక. తను డెరైక్ట్ చేయడమే కాకుండా, డి.యోగానంద్ వాళ్లకు ఎన్టీఆర్ బ్రేకిచ్చారు. ఇక సముద్రాల జూనియర్, సినారె, కొండవీటి వెంకటకవి, నాగభైరవ కోటేశ్వరరావు, రతన్‌బాబు లాంటి రచయితలు, రవికాంత్ నగాయిచ్, కేఎస్ ప్రకాష్, నందమూరి మోహనకృష్ణ లాంటి ఛాయాగ్రాహకులు ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో సుప్రసిద్ధ స్వరకర్తలు  రవీంద్రజైన్, సి.రామచంద్రతో తెలుగు పాటకు బాణీల వోణీలు కట్టించారు. దాదాపుగా విశ్రాంత జీవితం గడుపుతున్న గాలిపెంచల నర సింహారావుతో ‘సీతారామకల్యాణం’ కోసం చిరస్మరణీయ సంగీతాన్ని రాబట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఎంచుకున్న కథాంశాల్లోని గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది.
 
 మనకు చాలా గొప్ప గొప్ప నిర్మాణ సంస్థలున్నాయి. ఎన్‌ఏటీ కూడా కచ్చితంగా ఆ జాబితాలో అగ్ర తాంబూలం అందుకునే సంస్థే. ఎన్టీఆర్ ఏ నేపథ్యాన్నీ వదల్లేదు. జానపదం... పౌరాణికం... చారిత్రకం... సాంఘికం... అన్నింట్లోనూ దడదడలాడించేశారు. అసలు ఈ నాలుగు నేపథ్యాలతో సినిమాలు తీసి జయభేరి మ్రోగించిన నిర్మాణ సంస్థ ఇదొక్కటే. నో డౌట్. అలాగని ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంతోనే ఆగిపోలేదు. సినిమా థియేటర్లు కట్టారు. స్టూడియో పెట్టారు. చివరకు పంపిణీ సంస్థ కూడా నెలకొల్పారు. ఇలా నాలుగు విభాగాల్లోనూ రాణించిన తొలి సంస్థగా ఎన్‌ఏటీ ఓ రికార్డ్ సృష్టించింది. ఎన్టీఆర్ కలల క్షేత్రం... ఎన్‌ఏటీ. ఆయన పిల్లలు కూడా తండ్రి బాటలోనే నడిచారు. నడుస్తున్నారు. ‘పిచ్చిపుల్లయ్య’(1953) మొదలుకొని ‘వెంకటాద్రి’(2009) వరకూ ఈ సంస్థ ఆధ్వర్యంలో 43 సినిమాలొచ్చాయి. ‘ఏవీఎమ్’ తర్వాత ఒక కుటుంబం ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా నిర్వహించబడుతున్న సంస్థ అంటే ఇదే. ఎన్టీఆర్ వేసిన పునాది అటువంటిది మరి.