‘తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకని పరిస్థితి’

7 Jan, 2019 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండుగ సీజన్‌లో సినిమాలు రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరుస్తారు. తెలుగునాట పెద్ద పండుగైనా సంక్రాంతికి తమ సినిమాను బరిలో నిలిపి ప్రాఫిట్‌ పొందాలని నిర్మాతలు భావిస్తారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల విడుదలపై నిర్మాతల్లో నెలకొన్న వివాదం ముదిరింది. సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పేట చిత్రానికి తెలుగు రాష్ట్రాలో థియేటర్లు దొరకడం లేదంటూ నిర్మాత అశోక్‌ వల్లభనేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అశోక్‌ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. సంక్రాంతికి తెలుగు నుంచి 3 పెద్ద సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి ధియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల ముందే ప్రకటించినట్టు తెలిపారు. అశోక్‌ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. కాగా, ఈ సంక్రాంతికి రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్’‌, వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌2’ చిత్రాలతో పాటు పేట చిత్రం కూడా విడుదల కాబోతుంది.

మరిన్ని వార్తలు