విధితో పోరాడిన చక్రవర్తి

14 Dec, 2015 23:54 IST|Sakshi
విధితో పోరాడిన చక్రవర్తి

 ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి ’... చిరంజీవి కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్. ఈ సినిమాకు మూల కథా రచయిత ఎవరో కొద్దిమందికే తెలుసు. ఆయనే శ్రీనివాస చక్రవర్తి. రచయితగా, దర్శకుడిగా ఒక దశలో చక్రవర్తిలానే బతికారాయన. కట్ చేస్తే- కాలం రాసిన స్క్రీన్‌ప్లేకి ఆయన లైఫ్ క్లైమాక్స్ మొత్తం కడు విషాదమయమైపోయింది. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అనామకంగా కన్ను మూయాల్సి వచ్చింది.
 
  గత పది రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో పోరాడుతూ సోమవారం ఉదయం ఆయన కన్ను మూశారు. ఒక రచయిత జీవితం ఇలా ముగిసిపోవడం నిజంగా విషాదమే. ఏలూరుకు చెందిన శ్రీనివాస చక్రవర్తి అప్పట్లో రాజ్‌కపూర్ తీసిన ‘బాబీ’ చిత్రంతో అసిస్టెంట్ డెరైక్టర్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. కేయస్ ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, బాపు, విజయనిర్మల తదితర హేమాహేమీల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు.
 
  ‘ఎంగళ్ వాద్యార్’ అనే తమిళ సినిమాతో కథా రచయితగా కొత్త అవతారం ఎత్తారు. ‘అనురాగ  బంధం’, ‘చుట్టాలబ్బాయ్’, ‘అనాదిగా ఆడది’, ‘పుణ్య దంపతులు’, ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’, ‘పెళ్లి’ తదితర చిత్రాలకు రచన చేసింది ఆయనే. మలయాళంలో ‘పతివ్రత’ లాంటి సినిమాలు డెరైక్ట్ చేశారు. ఒకప్పటి మలయాళ నాయిక పద్మప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకో కుమార్తె. పద్మప్రియ ఆకస్మిక మరణం, కూతురి అనారోగ్య సమస్యలు ఆయన్ను బాగా కుంగదీసాయి. చక్రవర్తిలా బతికిన వాడు చిన్న హాస్టల్‌లో అనామకుడిలా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా విధిపై ఒంటరి పోరాటం చేయడానికి ప్రయత్నించారు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’కి సీక్వెల్ కథ సిద్ధం చేశాననీ, తన దగ్గర మరో పది స్క్రిప్టులు ఉన్నాయనీ అనేక సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు.
 
 
  చివరి క్షణం వరకూ కథల గురించి ఆలోచిస్తూ ఓ కథగా మిగిలిపోయారాయన.
 కోడి రామకృష్ణ తీసిన సూపర్‌హిట్ ‘పెళ్ళి’ చిత్రానికి కథ శ్రీనివాస చక్రవర్తి అయితే, మాటలు జి. సత్యమూర్తి. విధి రాసిన వింత స్క్రిప్ట్ ఏమిటంటే... ఈ రచయితలు ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం.