‘గాందీ’లో అందుబాటులో ఫ్రీజర్స్‌

9 Nov, 2023 01:33 IST|Sakshi

హైకోర్టుకు ఆస్పత్రి సూపరింటిండెంట్‌ అఫిడవిట్‌ సమర్పణ 

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో ఫ్రీజర్‌బాక్సులు అందుబాటులో లేవన్న సమస్యే ఉత్పన్నం కాదని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున సాంకేతిక సమస్యలు కూడా తలెత్తవని ప్రస్తుతం ఆస్పత్రిలో 62 ఫ్రీజర్‌ బాక్సులున్నాయని ఆస్పత్రి సూపరింటిండెంట్‌ హైకోర్టుకు అఫిడవిట్‌ సమరి్పంచారు. గాంధీ ఆస్పత్రిలో కోల్డ్‌ స్టోరేజీ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌ఈ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...‘గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 62 ఫ్రీజర్‌ బాక్సులున్నాయి. రోజుకు 15 నుంచి 20 మృతదేహాలు ఆస్పత్రికి వస్తాయి. ఇందులో 3 నుంచి 4 గుర్తుతెలియనివి ఉంటాయి. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత గుర్తించిన మృతదేహాలను బంధువులకు అందజేస్తారు. గుర్తు తెలియని వాటిని 72 గంటల పాటు ఫ్రీజర్‌లో భద్రపరిచి ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించి.. మున్సిపాలిటీ అధికారులకు అందజేస్తారు.

వారు నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనూ అవసరమైతే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పలు కారణాల రీత్యా వ్యక్తి మృతిచెందిన రోజే పోస్టుమార్టం సాధ్యం కాదు. 60 బాక్సులకు 25 మాత్రమే పని చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనం అవాస్తవం’అని ఆస్పత్రి సూపరింటిండెంట్‌ ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటిండెంట్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఫ్రీజర్స్‌ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు