ఫిలింఛాంబర్‌లో దాసరి విగ్రహావిష్కరణ

4 May, 2018 18:12 IST|Sakshi

దాసరి జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు శుక్రవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ‘దాసరి గారు పరిశ్రమ కష్టాలను తన ఇంట్లో కష్టాలుగా భావించేవారు. దాసరి గారితో ఎప్పుడో సినిమా చేయాలి కానీ, ఆయన తన 150వ సినిమాగా పరమ వీర చక్ర చేయడం నా అదృష్టం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా, కార్మికుడిగా ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయ’ని బాలకృష్ణ అన్నారు. ‘ దాసరి గారికి దాదా సాహెబ్‌ ఫాల్కే, భారత రత్న అవార్డులు ఇవ్వాలని పార్లమెంట్‌లో పోరాడుతామ’ని ఎంపీ మురళీ మోహన్‌ తెలిపారు. 

దర్శక దిగ్గజం, నిర్మాత, నటుడు డాక్టర్‌ దాసరి నారాయణరావు 71వ జయంతి సందర్భంగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. దాసరి జయంతిని డైరెక్టర్స్‌ డేగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని.. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, సి.కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది. దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో నిర్వహించనున్నారు. ఇక పలువురు దర్శకులు, సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తమ సందేశాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల పేర్కొన్నారు. ‘అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు