బీసీల కోసం కేసీఆర్‌ ఎంతో చేశారు

30 Oct, 2023 03:30 IST|Sakshi

జూలూరు గౌరీశంకర్‌ ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్తకావిష్కరణలో తలసాని  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీలకు, అట్ట డుగు వర్గాల పేదల అభ్యున్నతికి కేసీఆర్‌ లాగా కృషి చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్తకాన్ని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ‘మేమొస్తే బీసీ సీఎం’ అని అమిత్‌ షా ప్రకటించడం పచ్చి బూటకమని విమర్శించారు.

బీజేపీకి, కాంగ్రెస్‌కి బీసీ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ బీసీల జీవన ప్రమాణాలు పెంచడంపై లేదని విమర్శించారు. పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ దార్శ నిక ఆలోచనలకు ఆచరణ రూపంగా బీసీలు నిలిచి తీరుతారని, కేసీఆర్‌ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు.
 

మరిన్ని వార్తలు