నాకా ఆందోళన లేదు

3 Apr, 2019 02:34 IST|Sakshi
శివ నిర్వాణ

‘‘నేను చేసింది రెండు సినిమాలే (నిన్ను కోరి, మజిలీ). నేను ఎప్పుడూ రెండోసారి కథ చెప్పలేదు. సింగిల్‌ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే అవుతుంది. ఆ తర్వాత టీమ్‌తో ఆ కథ గురించి చర్చలు జరుపుతా’’ అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్‌ కథానాయికలుగా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ చెప్పిన విశేషాలు.

► ‘నిన్ను కోరి’ చిత్రానికి మంచి అభినందనలు వచ్చాయి. రవితేజ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌గార్లు మాట్లాడారు. ఇలాంటి పాయింట్‌తో కథ చెప్పి ఎలా ఒప్పించావ్‌? అని ఎక్కుమంది అన్నారు. నేను ఒప్పించడం కాదు. నానీగారు ఒప్పుకోవడం గొప్ప అన్నాను.

► ఆ తర్వాత నాగచైతన్యగారు ఫోన్‌ చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడా ప్రేమకథ ఏమైనా ఉంటే చెప్పమన్నారు. 20 రోజుల తర్వాత ఐడియాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘మజిలీ’ సినిమా తట్టింది. ‘క్రికెట్‌.. ప్రేమ.. పెళ్లి’ అనే మూడు అంశాలను తీసుకుని మిడిల్‌ క్లాస్‌ డ్రామాతో క్లబ్‌ చేయాలనే ఆలోచనలోంచి ఈ సినిమా కథ వచ్చింది. సింగిల్‌ నరేషన్‌లో చైతన్యగారు ఒప్పుకున్నారు. 19 ఏళ్ల కుర్రాడిలా, 34 ఏళ్ల వ్యక్తిలా ఇలా చైతన్యను స్క్రీన్‌పై ఎలాగైనా చూపింవచ్చు. అది కూడా ప్లస్‌ అయ్యింది.

అలా ‘మజిలీ’ ప్రయాణం మొదలైంది. ‘నిన్ను కోరి’ లవ్‌స్టోరీ. ‘మజిలీ’ మాస్‌ లవ్‌స్టోరీ అని చెప్పగలను. వెంట వెంటనే సేమ్‌ జానర్‌లో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ‘నిన్ను కోరి’ కంటే ‘మజిలీ’ చిత్రానికి ఎక్కువ కష్డపడ్డాం. ఇది ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ కాదు. ముగ్గురు (చైతన్య, సమంత, దివ్యాంక) ఒక ఫ్రేమ్‌లో ఉండరు. అదే ‘నిన్ను కోరి’కి, మజిలీ సినిమాకు డిఫరెన్స్‌. డేట్స్‌ క్లాష్‌ వల్ల సంగీత దర్శకుడు గోపీసుందర్‌గారు రీ–రికార్డింగ్‌ చేయలేకపోయారు. ఆ తర్వాత తమన్‌గారు వచ్చారు. బాగా చేశారు.

► క్రికెటర్‌ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్‌ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. నా సినిమాల్లో నా రియల్‌లైఫ్, నా స్నేహితుల జీవితాల్లోని సంఘటనలు ఉంటాయి. సెన్సిబుల్‌ కథలను నిర్మాతలు అర్థం చేసుకుంటే ఇంకా మంచిసినిమాలు వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రనిర్మాతలు బాగా సహకరించారు.

► సమంతగారు ఎప్పుడూ బాగా నటిస్తారు. కానీ చైతన్య ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. చైలో ఎంత సామర్థ్యం దాగి ఉందో స్క్రీన్‌పై తెలుస్తుంది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు.

► ట్రైలర్‌లో గమనిస్తే ఓ షాట్‌లో చైతన్యకు సమంత గొడుగు పడుతుంది. అది ఇంట్రవెల్‌లో వస్తుంది.  ‘నిజజీవితంలో నిజంగా అలాంటి భార్యలు ఉంటారా?’ అని చాలామంది అడిగారు. మనకు తెలియదు కానీ మన∙లైఫ్‌లో మన వైఫ్‌లు మన కోసం నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం గుర్తించం అంతే. అయితే అందరూ గొడుగులు పట్టక్కర్లేదు. అది చెప్పడానికే ట్రై చేశాను.

► వెధవలకు మంచి పెళ్లాలే దొరుకుతారు అనేది పూర్ణ పాత్రను పోసానిగారు చూసిన దృష్టికోణంలోనిది. అది జనరలైజ్‌ చేసి చెప్పింది కాదు. నటీనటుల ఇమేజ్‌ గురించి పెద్దగా ఆలోచించను. థియేటర్‌లోకి ప్రేక్షకులు వెళ్లాక కథలో నాగచైతన్య గుర్తుంటే నేను ఫెయిలైనట్లే. పూర్ణ గుర్తు ఉంటే నేను సక్సెస్‌ అయినట్లు.

► నా తొలి సినిమా ‘నిన్ను కోరి’ సక్సెస్‌ అయ్యింది. రెండో సినిమా జాగ్రత్త అని చాలామంది అన్నారు. కానీ నాకా ఆందోళన లేదు. ఈ రెండో సినిమా దాటేస్తే... మూడో సినిమా ఫ్లాప్‌ కొట్టినా.. పర్లేదా.. నాలుగో సినిమా వస్తుందా? అని అడిగాను. రెండు కథలను పక్కన పెట్టేలా చేసింది ఈ సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

► ప్రస్తుతం నా దగ్గర ఒక కామెడీ, ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథలు రెడీగా ఉన్నాయి. ఏది చేస్తాను అనేది ‘మజిలీ’ రిజల్ట్‌ తర్వాత తెలుస్తుంది.

మరిన్ని వార్తలు