మాకేదైనా అవుతుందని నాన్నకు భయం!

21 Jan, 2016 00:39 IST|Sakshi
మాకేదైనా అవుతుందని నాన్నకు భయం!

చాలా సినిమాలు లెక్కల్లో నిలుస్తాయి. కొన్ని సినిమాలే లెక్కలేనన్ని మనసుల్ని గెలుస్తాయి. ‘ఆర్య’, ‘100% లవ్’, ‘1... నేనొక్కడినే’ ... ఇలా ఏ సినిమా చేసినా ఏవేవో లెక్కలేసుకొని సినిమాలు చేయడం రాని మాజీ లెక్కల మాస్టారు సుకుమార్. ‘‘బ్రెయిన్ కన్నా హృదయాన్ని ఎక్కువ నమ్ముతా’’ అని బల్లగుద్దే ఆయన మరోసారి ప్రేక్షకుల మనసుల్ని గెలిచేందుకు చేసిన ప్రయత్నం - ‘నాన్నకు ప్రేమతో’.  సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తాలూకు అనుభూతుల్ని గుర్తు చేసుకుంటున్న ఈ సుమనస్సుకుమారుడి ఎమోషనల్ టాక్...
 
  మీరూ, మీ హీరో తారక్ గెటప్ లాగా గడ్డం పెంచుతున్నారే!
 గడ్డం ఉంటేనే నాకు బాగుంటుందని కొద్దికాలంగా అలా కనిపిస్తున్నా. ఇప్పుడు మా పిల్లాడు కూడా ‘చేతితో దువ్వుకోవడానికి వీలుండేలా నాన్నలా నాకూ గడ్డం కావాల’ని వాళ్ళమ్మను అడుగుతున్నాట్ట!
 
  ‘నాన్నకు ప్రేమతో’కి వస్తున్న రెస్పాన్స్ విన్నాక ఏమనిపిస్తోంది?
 సంతోషంగా ఉంది. మునుపటి సినిమాలకు వేటికీ మా ఊరు, చుట్టు పక్కల నుంచి ఎప్పుడూ ఫోన్లు రాలేదు. కానీ ఈ సినిమా బాగుందంటూ చాలా ఫోన్లు వచ్చాయి. పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాననిపిస్తోంది.
 
  మరి, సినిమా పరిశ్రమలో వాళ్ళేమన్నారేంటి?
 మొదటి రోజే దర్శకుడు వి.వి. వినాయక్ ఫోన్ చేశారు. ఊళ్ళో వాళ్ళ మామయ్య గారు సినిమా చూసి ఆ ఎమోషన్‌తో ఏడుస్తూ బయటకొచ్చార్ట! ‘ఎవరేమన్నా పట్టించుకోకు. మంచి సినిమా తీశావ’ని వినాయక్ అన్నారు. అలాగే, దర్శకుడు కొరటాల శివ, వక్కంతం వంశీ అభినందించారు. తారక్ ఫ్యాన్స్ నుంచీ మంచి రెస్పాన్సొచ్చింది. అందుకే, తొలిరోజు నుంచి నమ్మకంగా ఉన్నా.  
 
  ‘గుర్తుంచుకో మళ్ళీ చెబుతా’ డైలాగ్ ఎక్కడిది?
 (నవ్వేస్తూ) అది నా అలవాటు. డిస్కషన్స్‌లో ఒక విషయం మాట్లాడుతుంటే, మధ్యలో మరో ముఖ్య విషయం గుర్తొస్తే, నా అసిస్టెంట్స్‌తో అలా అంటూ ఉంటాను. అదే సినిమాలో పెట్టాను. అందరికీ నచ్చింది.
 
  జనానికి చూపించకుండా, మీరే పక్కనపెట్టిన సినిమా ఎంతుంది?
 (నవ్వేస్తూ...) చిత్రీకరించక ముందే కొన్ని లేపేశా. ఫస్టాఫ్‌లో ఒక సీన్ ఎడిటింగ్‌లో తీసేశాం. ఇప్పుడు అది కూడా కలుపుదామనుకుంటున్నాం.
 
  ‘కుమారి 21ఎఫ్’ హీరోయిన్‌తో సీన్లు తీసేశార్ట!
 అదేమీ లేదండి. అవన్నీ వట్టి పుకార్లు. అసలు హెబ్బా పటేల్ ఈ సినిమాలో నటించనే లేదు.
 
  మీరు ఐటమ్ సాంగ్‌‌స స్పెషలిస్ట్‌కదా. ఈ సినిమాలో మాత్రం పెట్టలేదేం?
 ఈసారీ పెడదామనుకున్నా, కానీ కథలో కుదరలేదు (నవ్వులు...) జనరల్‌గా నా సినిమాల్లో సెకండాఫ్‌లో సెకండ్ సాంగ్ అదే ఉంటుంది.
 
  ఇది ఇంటెలిజెంట్‌ఫిల్మనీ, కింద సెంటర్లకు అర్థమవుతుందా అనీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు!
 ఎగ్జామ్‌లో మనం ఫెయిలవ్వచ్చేమో కానీ, ఆడియన్స్ ఫెయిల్ కారు. ‘1’ సినిమా కింద సెంటర్లలో అర్థమవుతుందా, లేదా అని భయపడ్డా. ఆడియన్స్‌కు అర్థమయ్యేలా చెప్పకపోవడం వల్లే అది ఆడలేదు. నా తప్పే. కానీ, ఈసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే, ‘టెర్మినేటర్’ సినిమా నాకు అప్పట్లో అర్థం కాలేదు. కానీ, అమ్మాయిని రక్షించడమనే ఎమోషన్‌ను బీ, సీ సెంటర్ల జనమూ చూశారు.
 
  కానీ, ఇదేదో ‘ఏ’ క్లాస్ సెంటర్ల సినిమా అని...!
 (నవ్వేస్తూ...) ఊరి నుంచి సామాన్య డ్రైవర్ ఒకతను నాకు ఫోన్ చేసి, ‘సార్! ఈ సినిమా మనకు అర్థమవుతుంది సార్. కానీ, బీ, సీ సెంటర్స్‌లో అర్థమవుతుందో లేదో’ అన్నాడు. అప్పుడెప్పుడో ‘శంకరాభరణం’ సినిమాకు ఓ రిక్షావాడు ‘సినిమా చాలా బాగుంది సార్. కానీ, మాస్‌కి నచ్చుతుందో, లేదో’ అన్న సంగతి నాకు గుర్తొచ్చింది.
 
  హీరో తండ్రిని విలనెలా మోసం చేశాడో ఒక్క సీనైనా చూపిస్తే...!
 (మధ్యలోనే అందుకుంటూ...) మోసం ఎలా చేశారనేది ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాం. కానీ, ఈసారి ఆ మోసం వల్ల ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడేదన్నది చూపించాలనుకున్నా. చూపించా.
 
  కొద్దిగా వయసొచ్చిన పిల్లలు జరిగినవి మర్చిపోవడం లాజిక్కేనా?
 పదకొండేళ్ళ పిల్లలు తప్పిపోయి, కుటుంబం, భాష మర్చిపోయిన ఘటనలెన్నో పత్రికల్లో చూస్తూనేవున్నాం. అయినా నన్నడిగితే లాజిక్‌లు మాట్లాడడం మొదలెడితే, సినిమాల్లో ఒక్క సీనూ మిగలదు. కథనీ, ఎమోషన్స్‌నీ జాగ్రత్తగా కూర్చామా, పేర్చామా, చెప్పామా అనేదే ముఖ్యం.
 
  ఏమైనా లెక్కల మాస్టార్ పాఠం చెప్పినట్లు సిన్మా తీశారని...!
 ప్రశ్నలడగడంలో మీదో స్టైల్. సినిమా తీయడంలో నాదో స్టైల్. ఎవరి శైలి వాళ్ళదే. నా స్టైల్ నుంచే నా సృజన వస్తుంది. అది లేకుండా మీరైనా, నేనైనా పని చేయలేం. అలాకాక వేరే రకంగా చేయాలంటే, మానసికంగా మరణించి, పునర్జన్మనెత్తాలి. నేను బ్రెయిన్ కన్నా హృదయాన్ని నమ్ముతా.
 
  హృదయం మాట విని, (డబ్బు) లెక్కలేసుకోవడం మానేస్తున్నట్లున్నారే!
 కెరీర్ మొదటి నుంచి కూడా నేను (డబ్బు) లెక్కల మీద దృష్టి పెట్టలేదు. ‘డబ్బు వెనక పడకు. డబ్బే నీ వెనక పడుతుంది’ అని అల్లు అరవింద్ గారు ఒకసారి నాతో అన్నారు. నేనిప్పటికీ అదే ఫాలో అవుతున్నా.
 
  ఇంతకీ సినిమా చూసి, అన్నయ్యలేమన్నారు? అమ్మ ఏమన్నారు?
 అన్నయ్యలతో పాటు ఇంట్లో అందరూ బాగుందన్నారు. బాగా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. మా అమ్మ ఇంకా చూడలేదు. (ఉద్వేగానికి గురవుతూ..) మా నాన్న బాగోగులే లోకంగా బతికి, చివరి దాకా సేవ చేసిన ఆవిడ నాన్న పోయాక, అనారోగ్యం పాలైంది. లేచి నడవలేకపోతోంది.
 
  సినిమా మాటలా ఉంచి, లైఫ్‌లో అమ్మానాన్నలతో మీ అనుబంధం?
 (ఆలోచనల్లోకెళుతూ...) మిగిలిన ప్రేమలన్నీ వేరు, అమ్మానాన్న ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ 100% ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు వాళ్లు మన కోసం పడ్డ కష్టం ఒక్కసారి గుర్తు చేసుకుంటే కళ్ళు చెమరుస్తాయి. నేను చదువుకునేటప్పుడు ఇంట్లో మొత్తం పని చేసి, మా అమ్మ నా కోసం కాచుకు కూర్చొనేది. రాత్రి అంతా నేను చదువుకుంటూ ఉంటే, నేనెప్పుడు కాఫీ అడుగుతానో, టీ అడుగుతానో అని నా పక్కనే కూర్చునేది. మా నాన్న మేం పడుకున్నప్పుడు వచ్చి దుప్పటి సరిగ్గా కప్పుకున్నామా, లేదా అని చూసి, సరిచేసేవారు. అంటే వాళ్లకి లైఫ్ అంటే పిల్లలే! అవన్నీ ఈ తరంలో ఊహించలేం! మన ప్రాధాన్యాలు మనకు ఉన్నాయి.
 
  మీ నాన్న గారు మీతో ఎలా ఉండేవారు?
 మేము నలుగురు అన్నదమ్ములం, ఇద్దరు సిస్టర్స్. నేను ఆఖరు. మాకు కనీసం కూరగాయలు కొనడం కూడా రాదు. మా నాన్న ఒక్క పని కూడా మాకు చెప్పేవారు కాదు. మేం సైకిలెక్కి వెళితే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందని ఆయన టెన్షన్. పల్లెటూళ్లో అందరికీ ఈత వచ్చు. కానీ మాకు రాదు. ఆయన చేయనిచ్చే వారు కాదు. ఎందుకంటే మాకు ఏదైనా అవుతుందేమోనని భయం. మా మీద ఆయనకంత ప్రేమ. నేను లెక్చరర్‌గా చేసేటప్పుడు తెల్లవారే 4 గంటలకు నిద్ర లేస్తే, రాత్రి 12 గంటల వరకూ క్లాస్‌లుండేవి. శనివారం రాత్రి బస్సెక్కి ఆదివారం ఉదయం ఇంటి కెళ్లేవాణ్ణి. నిద్రలేకుండా పీక్కుపోయిన నన్ను చూశారనుకోండి- ‘బోడి ఉద్యోగం... మానేయ’మనేవారు మా నాన్న. మేము చాలా దిగువ మధ్యతరగతి. అయినా సరే ‘అంత కష్టపడడమెందుకు! నేను పోషిస్తా’ అనేవారు. మమ్మల్ని అందర్నీ కష్టపడి చదివించి, పెద్ద చేశారు.
 
  నాన్న గారి చివరి క్షణాల్లో మీరెలా గడిపారు?
 ఆయన్ని హ్యాపీగా ఉంచాలని చాలా చెప్పేవాణ్ణి. ‘నాన్నా! సినిమా సూపర్‌హిట్’ అనో, ‘హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింద’నో - ఇలా బిల్డప్పులిచ్చేవాణ్ణి. అలా చెప్పడం వల్ల ఆయన హ్యాపీగా ఉంటే కొన్నాళ్లు ఎక్కువ జీవిస్తారని మనసులో ఏ మూలో ఆశ! ఏ వయసులో పోయినా ఫాదర్ ఫాదరేగా! కానీ ‘100 % లవ్’ క్లైమాక్స్ తీస్తున్నప్పుడే నాన్న పోయారు!
 
  నాన్న ఉన్నప్పుడు ఎక్కువ టైమ్ గడపలేదనే బాధ ఉందా?   
 అవును. ఆయన చెప్పే మాటలన్నీ వినాలి. రాసుకోవాలి. డ్రామాల్లో నటించిన ఆయన పద్యాలన్నీ పాడుతుంటే, రికార్‌‌డ చేయాలి. ఆయన్ని దేశ దేశాలు తిప్పాలి. ఇలా ఎన్నో అనుకున్నా. కానీ, ఎప్పుడూ కెరీర్ పరుగులో, ఫ్లాపొస్తే డిప్రెషన్ నుంచి బయటపడి మరొకటి తీసే పనిలో పడి ఫ్యామి లీపై దృష్టి పెట్టలేకపోయా. ఇప్పటికీ అంతే. అదే మనసుని బాధిస్తుం టుంది. ఇప్పటికైనా, మా అమ్మతో ఎక్కువ టైమ్ గడపాలని ప్రయత్నం.  
 
  మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు, రచనలంటే?   
 దర్శకుణ్ణయిన 2004కు ముందు చదివిన పుస్తకాల ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా చలంవి. ‘కుమారి 21ఎఫ్’ మెయిన్ ఫిలాసఫీ చలందే.
 
  మీ టైటిల్‌కార్‌‌డ్స, పాత్రచిత్రణ-అన్నీ డిఫరెంట్. మనసులో ఏముంటుంది?
 అశాంతి. ఎందుకో తెలియదు కానీ లోపల భయంకరమైన అశాంతి ఉంటుంది. దాని నుంచే కథలు పుడుతుంటాయి.
 
 మా నాన్నకీ, నాకూ విచిత్రమైన అనుబంధం. ఇప్పుడంటే పిల్లలతో క్లోజ్‌గా ఉంటాం. అన్నీ మాట్లాడేస్తుంటాం. అప్పుడు జనరేషన్ గ్యాప్ కదా... గౌరవంతో ఏమీ చెప్పేవాళ్లం కాదు. నాన్న వస్తున్నారంటే, వీధిలో నిలబడే వాళ్ళం కాదు. బుద్ధిగా ఇంట్లో కూర్చొనేవాళ్ళం. నాకు తెలిసి మా నాన్న నన్ను ముద్దు పెట్టుకున్నట్లు కూడా గుర్తులేదు. కానీ, ఆయన మన కోసం చేసే పనులను బట్టి... ఆయన ప్రేమ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట.

 - రెంటాల జయదేవ