Allu Arjun: నా ఇద్దరు కుమారులకు అవార్డ్ వచ్చిందన్నారు: అల్లు అర్జున్

22 Oct, 2023 14:26 IST|Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పుష్ప ది రైజ్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వరించింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  అయితే జాతీయ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ విందు ఏర్పాటు చేసింది.

ఈ పార్టీకి హాజరైన బన్నీ అవార్డ్‌ రావడం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాతీయ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. నా మిత్రుడు దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు వచ్చేందుకు సుకుమార్‌ ఎంతో శ్రమించారని బన్నీ వెల్లడించారు. 

అల్లు అర్జున్ మాట్లాడుతూ..'బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కు చాలా సార్లు చెప్పా. కానీ ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు వస్తా అనేవాడు. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాం. అక్కడా సక్సెస్ అందుకున్నాం. 20 ఏళ్లుగా దేవితో నేను అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా పేర్లు ప్రకటించినప్పుడు నాన్న చాలా సంతోషించారు.  ఇద్దరు కుమారులకు జాతీయ అవార్డులు వచ్చినట్లు ఉందన్నారు. ప్రిన్సిపల్‌ దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేని మేము.. ప్రెసిడెంట్‌ దగ్గర మెడల్స్‌ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా' అని నవ్వుతూ అన్నారు. 

నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా? ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. 

డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ..' జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ అవార్డు రావాలని సుకుమార్‌ నాకంటే ఎక్కువగా కోరుకున్నారు. ఆయనే అఛీవర్‌.. నేను కేవలం అఛీవ్‌మెంట్‌ మాత్రమే.' అని అల్లు అర్జున్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు