నటి ఇషాపై సెటైర్లు.. ఎదురుదాడి

27 Feb, 2018 14:51 IST|Sakshi

ముంబై : లక్షల మందిని పొట్టనపెట్టుకున్నా ఆరని జ్వాలలా రగులుతోన్న సిరియా సంక్షోభం.. గడిచిన మూడు నెలల్లో మరింత భయంకరంగా మారింది. సిరియన్‌-రష్యన్‌ దళాల సంయుక్త దాడుల్లో వందలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ నటి ఇషా గుప్తా కూడా సిరియా సంక్షోభంపై ఓ ట్వీట్‌ చేశారు. అయితే నటి ట్వీట్‌పై కొందరు ట్రోలర్స్‌ సెటైర్లు గుప్పించారు. తిరిగి ఆమె ఎదురుదాడి చేయడంతో తోకముడిచారు.

సిరియా అంతర్యుద్ధంలో గాయపడ్డ ఓ చిన్నారి ఫొటోను ట్వీట్‌ చేసిన ఇషా దానికి ‘‘ ఏ మతం, ఏ ప్రభుత్వం అన్నది అప్రస్తుతం. మానవత్వం మంటగలుస్తోంది. అకారణంగా చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఇది ఆగాలి. సిరియాలో నెత్తుటిధారను ఆపాలి..’ అని కామెంట్‌ చేశారు. ఇషా ట్వీట్‌పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఏసీ రూమ్స్‌లో కూర్చొని కామెంట్లు పెట్టడంకాదు.. నువ్వే సిరియా వెళ్లి ఏమైనా చెయ్యరాదు..’ అని ఒకరు, ‘ప్రపంచంతో పోల్చుకుంటే చిన్నపిల్లల మరణాలు ఇండియాలోనే ఎక్కువ. నువ్వు సేవచెయ్యడానికి ఈ దేశం సరిపోదా?’ అని ఇంకొకరు.. రకరకాలుగా సెటైర్లు వేశారు.

ట్రోలర్ల తీరుపై మండిపడ్డ ఇషా.. ‘మానవత్వానికి హద్దులు గీస్తూ మీ వైకల్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పిల్లలు చనిపోవడానికి, వేరేవాళ్లచేతిలో హత్యకు గురికావడానికి చాలా తేడాఉంటుందని గుర్తించాలి. లేదంటే సిరియా మాదిరే మీరూ చీకటి యుగంలో ఉన్నట్లేలెక్క’’ అని ఎదురుదాడిచేశారు.
 

మరిన్ని వార్తలు