ఫిబ్రవరిలో సినిమా సందడి

21 Jan, 2017 12:06 IST|Sakshi
ఫిబ్రవరిలో సినిమా సందడి

సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కలకలలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు.

ముందుగా ఫిబ్రవరి 3న మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్తో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందిన లక్కున్నోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఆసక్తికరంగా తమ్ముడి మీద పోటికి బరిలో దిగుతోంది మంచు లక్ష్మి. లక్ష్మి లీడ్ రోల్లో తెరకెక్కిన లక్ష్మీబాంబ్ సినిమా కూడా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కింగ్ నాగార్జున మరోసారి భక్తాగ్రేసరుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు. అదే రోజు మంచు మనోజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గుంటూరోడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రానా నావీ కమాండర్గా నటిస్తున్న ఘాజీ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1971లో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో అదృశ్యమైన సబ్ మెరైన్ ఘాజీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే రోజు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెంపుడు కుక్కల దొంగగా కనిపించనున్నాడు.

ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అయిన 24న కూడా సినిమా సందడి కొనసాగుతోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ కేశవను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.