ప్రముఖ నటుడు కన్నుమూత

25 Dec, 2017 15:03 IST|Sakshi

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు . గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.

చూడగానే పక్కింటి అబ్బాయిగా కనిపించే పార్థ 60వ దశకంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. 1958లో 'మా' సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. తపన్‌ సిన్హా తెరకెక్కించిన 'అతిథియా' సినిమాతో హీరోగా మారారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌ కల్ట్‌ షార్ట్‌స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తపన్‌ సిన్హా తెరకెక్కించిన 'అపోంజాన్‌' సినిమాలో కూడా హీరోగా కనిపించారు. బెంగాల్‌ లెజెండ్‌ హీరో ఉత్తమ్‌కుమార్‌ తమ్ముడు, కొడుకు పాత్రలకు ఆటోమేటిక్‌ చాయిస్‌గా పార్థ గుర్తింపు పొందారు. బాలిక బధూ (1967), ధోన్యి మెయే (1971), అగ్నిష్వర్‌ (1975), అమర్‌ పృథ్వీ (1985), బాగ్‌ బందీ ఖేలా (1975) పాపులర్‌ సినిమాల్లో ఆయన నటించాడు.

ఎన్నో సినిమాల్లో గొప్ప అభినయాన్ని కనబర్చిన పార్థ ముఖోపాధ్యాయ బెంగాలీ సినీప్రేమికుల మదిలో ఎల్లప్పటికీ నిలిచి ఉంటారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు