అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

20 Dec, 2019 00:21 IST|Sakshi
రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌, త్రివిక్రమ్‌

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రతి ఏడాది టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన ‘ఇండియన్‌ టాప్‌ 100’ సెలబ్రిటీల జాబితాలో సినీ రంగం నుంచి 293.25 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలిచారు బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌. 2017లో నాలుగు, 2018లో మూడు స్థానాలను కైవసం చేసుకున్న అక్షయ్‌ ఈసారి మరో మెట్టు పైకి ఎక్కి రెండో స్థానం సంపాదించడం విశేషం.

ఇక 2017, 2018 సంవత్సరాల్లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ 229.25 కోట్ల ఆర్జనతో ఈ ఏడాది మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంకా హిందీ పరిశ్రమ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ (4,) షారుఖ్‌ ఖాన్‌ (6), రణ్‌వీర్‌ సింగ్‌ (7),  ఆలియా భట్‌ (8), దీపికా పదుకోన్‌ (10) టాప్‌ టెన్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇక వందకోట్ల సంపాదనతో ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి దక్షిణాది స్టార్స్‌లో అందరికంటే ముందు ఉన్నారు రజనీకాంత్‌.

గత ఏడాది ఫోర్బ్‌ జాబితాలో రజనీది 14వ స్థానం. ఈ ఏడాది ఏఆర్‌ రెహమాన్‌ 16, మోహన్‌లాల్‌ 27వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు మన తెలుగు పరిశ్రమ నుంచి ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో నిలిచిన వారిలో ప్రభాస్‌ ముందు వరుసలో ఉన్నారు. 2017లో 22వ స్థానం, గత ఏడాది అసలు ఈ లిస్ట్‌లోనే లేని ప్రభాస్‌ 2019 లిస్ట్‌లో 44వ ర్యాంక్‌లో నిలిచి టాలీవుడ్‌ హీరోల తరఫున ఈ లిస్ట్‌లో బోణీ కొట్టారు. ఇక 2017లో 37, 2018లో 33 ర్యాంకర్‌గా నిలిచిన మహేశ్‌బాబు ఈ ఏడాది 54వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా 68వ స్థానంలో తాప్సీ, 77వ స్థానంలో త్రివిక్రమ్‌ నిలిచారు.

ఇక క్రీడా రంగంలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. ఇతర స్టార్‌ క్రికెటర్స్‌ ఎమ్‌ఎస్‌. ధోనీ (05), సచిన్‌ టెండూల్కర్‌ (09) టాప్‌టెన్‌ జాబితాలో ఉన్నారు. మరో క్రికెటర్‌ రోహిత్‌ శర్మ 11వ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్‌  ప్లేయర్స్‌ పీవీ సింధు (63), సైనా నెహ్వాల్‌ (81) కూడా లిస్ట్‌లో ఉన్నారు.  క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ 88వ స్థానం దక్కించుకున్నారు.  సెలబ్రిటీల క్రేజ్, ప్రింట్, సోషల్‌ మీడియాలో ఉన్న పాపులారిటీ వంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ ర్యాంక్‌లు నిర్ణయించినట్లు ఫోర్బ్స్‌ ప్రతినిధులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అలాగే కొంతమంది సంపాదన అధికంగా ఉన్నప్పటికీ వారి ఫేమ్‌ని దృష్టిలో ఉంచుకుని ర్యాంక్‌లను కేటాయించినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది.  


ఆలియా భట్‌, దీపికా పదుకోన్‌, తాప్సీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా