హన్సిక నడుంపై దిష్టి చుక్క

29 Mar, 2016 03:14 IST|Sakshi
హన్సిక నడుంపై దిష్టి చుక్క

దిష్టి చుక్కను ఎవరైనా బుగ్గపై పెడతారు. మరేంటి హన్సిక నడుంపై దిష్టి చుక్క అంటున్నారనేగా మీ ఉచ్చుకత.ఆ ముచ్చటైన సంగతేమిటో చూద్దాం. సాధారణంగా అందమైన అమ్మాయిల్ని పాలరాతి బొమ్మగా వర్ణించడం చూస్తుంటాం. నటి హన్సిక మాత్రం ఇక్కడ తైలంతో తయారైన బొమ్మలా నిగ నిగలాడుతూ కాంతులీనుతుంది. అలాంటి అందం కంటి ముందు కదలాడితే దాన్ని సిల్వర్ స్క్రీన్‌పై మరింత వన్నెతో ఆవిష్కరించి ఊరు ఊరంతా మైమరచేలా చేయడమేగా దర్శకుడి నైపుణ్యం. ఆ పనే చేశారు దర్శకుడు ఏఆర్.రాజశేఖర్.ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఉయిరే ఉయిరే. ఇందులో నాయకి అందాల భరిణి హన్సిక. ఆమెకు జంటగా సీనియర్ నటి జయప్రద కొడుకు సిద్ధు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీన్ని నటి జయప్రద నిర్మించడం విశేషం. ఈ చిత్రంలోని అందమైన ప్రేమ దృశ్యాన్ని దర్శకుడు ప్రేమజంట అంటే ఇలా ఉంటారా? అని యువతే ఈర్శ్యపడేలా చిత్రీకరించారు. అది ముంబై నుంచి చెన్నైకి వెళ్లే విమానం. మధ్యలో గోవాలో ఆగింది. అక్కడ మంచి వయసులో ఉన్న అందాల భామ హన్సికకు చార్మింగ్ కుర్రాడు సిద్ధుకు మధ్య పరిచయం స్నేహంగా మారి గమ్మత్తుగా ప్రేమ చిగురించింది. ఈ దృశ్యాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ప్రేమ పక్షులు అనూహ్యంగా ఒక వివాహ వేడుకలో పాల్గొంటారు.


అప్పటి వరకూ మోడ్రన్ దుస్తులే ధరించిన హన్సికను చీర ధరించమని సిద్ధు రిక్వెస్ట్ చేస్తాడు.ప్రియుడి కోరికను మన్నించిన హన్సిక చీరతో సింగారించుకుని వస్తుంది.అందులో ఆమె అందాన్ని హీరో సిద్ధునే కాదు అక్కడున్న వారంతా మైమరచిపోతారు. దీంతో తేరుకున్న సిద్ధు పరుగెత్తుకుంటూ వెళ్లి హన్సిక కంటికి వేసుకున్న కాటుకను దిష్టి చుక్కగా ఆమె నడుంపై పెడతాడు. బుగ్గపైన దిష్టి చుక్క పెట్టేది అని మీరు అనవచ్చు.అయితే అక్కడి వారి దృష్టి అంతా హన్సిక నవ నవలాడే నడుంపైనే పడిపోవడంతో సిద్ధు దిష్టి చుక్కను అక్కడ పెట్టారు.ఉయిరే ఉయిరే చిత్రంలో ఈ అందాల సన్నివేశాలు చూసి మీరు మైమర చిపోవాలంటే ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీన తెరపైకి రానుంది.