గూగుల్‌లో ఉద్యోగం చేశాను..

26 Jun, 2019 12:56 IST|Sakshi

యువతకు సినీ హీరో నిఖిల్‌ పిలుపు

భీమవరం(ప్రకాశం చౌక్‌): సినిమాల్లో నటించాలని తపనతో ఉండే యువత ముందు చదువు పూర్తి చేసుకుని రావాలని, తాను అలాగే చేసి సినిమాల్లోకి వచ్చానని హీరో నిఖిల్‌ తెలిపారు. పరిశ్రమలో ఏదైనా ఇబ్బంది వస్తే చదువే వారికి దారి చూపిస్తుందని చెప్పారు. తన కొత్త సినిమా అర్జున్‌ సురవరంలో జర్నలిస్టు పాత్ర చేసినట్టు వివరించారు. మంగళవారం భీమవరంలో రక్షదళ్‌ సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. అనంతరం స్థానిక మంగదొడ్డి మహేంద్ర నివాసంలో ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్న: మీ స్వస్థలం ఎక్కడ, ఏమి చదువుకున్నారు?
నిఖిల్‌: నేను హైదరాబాది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గూగుల్‌లో కూడా వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను. సినిమాలపై ఇష్టంతో పరిశ్రమకు వచ్చాను.

ప్రశ్న: మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది?
నిఖిల్‌: దర్శకులు శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ సినిమాకు సెలక్షన్స్‌ జరుగుతుంటే వెళ్లాను. ఆయన నన్ను ఆ సినిమాలో స్టూడెంట్‌ పాత్రలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాకు నిజంగానే హ్యాపీడేస్‌ ప్రారంభమయ్యాయి.

ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు?
నిఖిల్‌: ఇప్పటికి 17 సినిమాలు చేశాను.

ప్రశ్న: గుర్తింపు తెచ్చిన సినిమాలు?
నిఖిల్‌:నేను నటించిన అన్ని సినిమాలు నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా కార్తీకేయ, స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

ప్రశ్న: ప్రస్తుతం ఏ సినిమాలు చేశారు?
నిఖిల్‌: త్వరలో అర్జున్‌ సురవరం సినిమా వస్తుంది. అలాగే కార్తీకేయ–2, మరో రెండు కొత్త సినిమాలు చేయబోతున్నాను.

ప్రశ్న: అర్జున్‌ సురవరం సినిమా ఏలా ఉండబోతుంది?
నిఖిల్‌: : ఈ సినిమాలో నేను జర్నలిస్టు పాత్రలో నటించాను. విద్యార్థులకు జరుగుతోన్న అన్యాయంపై రాసిన కథ ఇది. మంచి సందేశం ఉంటుంది.

ప్రశ్న: మీకు ఇష్టమైన హీరో?
నిఖిల్‌: నాకు ఇష్టమైన హీరో చిరంజీవి. ఆయన గ్యాంగ్‌ లీడర్‌ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు గ్యాంగ్‌ లీడర్‌ సినిమా చూసి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.

ప్రశ్న: యువతకు మీరిచ్చే సలహా?
నిఖిల్‌: యువత డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే వారు ఖచ్చితంగా వారి లక్ష్యాలను చేరుకుని విజయం సాధిస్తారు.

ప్రశ్న: భీమవరం గురించి చెప్పమంటే?
నిఖిల్‌: భీమవరం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఇక్కడ ప్రజల ఆప్యాయతలు నాకు ఎంతో నచ్చుతాయి. భీమవరం పరిసర ప్రాంతాలు ఎంతో అందమైనవి. నాతో సినిమాలు చేసిన సుధీర్‌ వర్మ, చందు పశ్చిమ గోదావరి జిల్లా వాసులే. ఈ జిల్లాకు చెందిన ప్రతిభ గల వారు సినిమా పరిశ్రమలో ఉన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా