కోలీవుడ్‌కు మరో వారసుడు

21 Nov, 2018 10:53 IST|Sakshi
విలన్‌గా పరిచయం అవుతున్న సునీల్‌

సినిమా: కోలీవుడ్‌కు మరో సినీ వారసుడు పరిచయం అవతున్నారు. నటుడు వైభవ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్‌ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడైన వైభవ్‌ కోలీవుడ్‌లో యువ హీరోగా తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన అన్నయ్య సునిల్‌ నటుడిగా పరిచయం అవుతుండడం అదీ విలన్‌గా రంగప్రవేశం చేయడం విశేషం. నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం సీతకాది. «బాలాజి ధరణీధరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీతకాది డిసెంబర్‌ 20న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రముఖ నటీనటులను పరిచయం చేసే కార్యక్రమానికి చిత్ర వర్గాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చిత్ర విలన్‌ గురించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ వినోదంతో పాటు, భావోద్రేకాలతో కూడిన ఈ చిత్ర హీరో విజయ్‌సేతుపతి గురించి ఇప్పటికే పలు విషయాలను తెలియజేశామన్నారు.

ఆయన ఇందులో పలుగెటప్‌ల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారని చెప్పారు. మరో ముఖ్యపాత్ర విలన్‌ అని. ఈ పాత్రకు ఇప్పటి వరకూ పరిచయం కాని నటుడి నటన కొత్తగా ఉంటుందన్నారు. నటుడు వైభవ్‌ అన్నయ్య సునిల్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన పాత్ర చాలా వినూత్నంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రకు నటుడిని ఎంపిక చేయడం సవాల్‌గా మారిందన్నారు. చిత్ర కథకు కథనాన్ని తయారు చేసుకున్నప్పుడే మామూలుగా ఉండరాదని విభిన్నంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో నటించడానికి చాలా మంది ప్రముఖ నటులను సంప్రదించామని, వారికి పాత్ర నచ్చినా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా నటించలేకపోయారని అన్నారు. అలా ఒక పుట్టినరోజు వేడుకలో సునీల్‌ను చూసి తన చిత్రానికి విలన్‌ తనేనని నిర్ణయించుకున్నానన్నారు. ఆయన నటించడానికి ముందు సంకోచించినా, చివరికి అంగీకరించినట్లు తెలిపారు. అందుకు సునీల్‌ చాలా శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. ఇందులో హీరో విజయ్‌సేతపతి పాత్రకు తగ్గని విధంగా విలన్‌ పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు బాలాజి ధరణీధరన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు