నటన వీడి.. ఐఎస్తో పోరాడుతున్నాడు..

7 Jun, 2015 10:30 IST|Sakshi
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంలో మైఖేల్ ఎన్రైట్ .. సిరియాలో ఐఎస్ తో పోరాడుతూ..

జోర్దాన్: మొన్నటివరకు 'స్టార్ట్ కెమెరా' అనగానే ఠక్కున మూడ్లోకి వెళ్లిపోయి దర్శకుడు కోరిన రీతిలో నటించి.. అందరినీ మెప్పించిన హాలీవుడ్ నటుడు.. ఇప్పుడు నిజం తుపాకి పట్టుకుని కదనరంగంలోకి దిగాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే తన లక్ష్యమని ప్రకటించాడు. ఇంకెప్పటికీ ఇంటికి రానని, రాలేనని కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పాడు.

జానీ డెప్ హీరోగా నటించిన 'పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్', టామ్ క్రూజ్ 'నైట్ అండ్ డే', జాన్ ట్రొవాల్టో 'ఓల్డ్ డాగ్స్' తదితర చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించిన నటుడు మైఖెల్ ఎన్రైట్ ప్రస్తుతం సిరియాలో ఉంటున్నాడు. కుర్దూ దళాలతో కలిసి ఐఎస్ ఉగ్రవాదులతో  పోరాడడుతున్నాడు.

చక్కటి సినీ కెరీర్ ను కాదనుకుని ఇలా కదనరంగంలోకి దూకాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. ' కొన్ని నెలల కిందట ఐఎస్ ఉగ్రవాదులు ఓ అమెరికన్ జర్నలిస్టును తల నరికి ఆ దృశ్యాల్ని ఇంటర్నెట్లో ఉంచారు. అది నన్ను బాగా కదిలించింది. మనుషుల్ని అంత క్రూరంగా చంపి, ఆనందించేవాళ్లు భూమిమీద ఉండటానికి అనర్హులు. అందుకే ఆ ఉగ్రవాదుల్ని, ఐఎస్ సంస్థ మొత్తాన్నీ కూకలివేళ్లతో పెకిలించివేయాలనుకున్నా' అంటూ తను తుపాకి పట్టడానికి గల కారణాలు చెబుతాడు మైఖేల్.

గత ఫిబ్రవరిలో సిరియా వచ్చిన మైఖేల్.. కదనరంగంలో దూసుకుపోతోన్న వీడియో ఒకదానిని కుర్దీష్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్(వైపీజీ) విడుదల చేసింది. అయితే మనవాడికి కాస్త మెంటల్ అని, అందుకోసం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని మైఖేల్ సన్నిహితుడు ఒకరు మీడియాతో చెప్పారు. మతిస్థిమితం లేనందునే  ముందూ వెనుకా చూడకుండా కుర్దూ దళాల్లో చేరిపోయాడని పేర్కొన్నారు.

ఇటు కుర్దూ దళాలు కూడా మైఖేల్ తీరుతో ఇబ్బందులు పడుతున్నాయని, చెప్పిన మాట వినకుండా ఇష్టారీతిరగా ప్రవర్తించడం, క్రమశిక్షణ లేకపోవడం లాంటి అలవాట్లను మైఖేల్ మానుకోలేకపోయాడని, ఉగ్రవాదులతో పోరుకు ఆయన పనికిరాడని కుర్దూ  సైనికాధికారులు భావిస్తున్నారట! ఈ మేరకు బ్రిటన్లో నివసిస్తోన్న కుటుంబసభ్యులకు లేఖలురాసి మైఖేల్ను ఇంటికి తీసుకుపోవాల్సిందిగా కోరారట!