ఆ రోజుని ఇప్పటికీ మరిచిపోలేను

6 Oct, 2013 00:37 IST|Sakshi
ఆ రోజుని ఇప్పటికీ మరిచిపోలేను
అప్పుడు మడోన్నా వయసు 20 ఏళ్లు. ఎన్నో కలలు... ఎన్నెన్నో ఆశలు... ఏవేవో కోర్కెలు... రకరకాల ప్రణాళికలు. మనసు నిండా వీటన్నింటినీ నింపుకుని ఓ శుభముహూర్తాన న్యూయార్క్‌లో అడుగుపెట్టారు మడోన్నా. కానీ కాలం కరుణా కటాక్షం ఆమెకు అంత సులువుగా దొరకలేదు. వరుసగా చేదు అనుభవాలు. ఇంటి అద్దె కట్టడం కోసం ఆర్ట్ క్లాసులకి నగ్నంగా మోడలింగ్ చేయడం, అవసరం కోసం తను చేస్తున్న ప్రదర్శనను ఇతరులు ఇంతింత కళ్లేసుకుని చూస్తుంటే కుమిలిపోవడం ఇప్పటికీ మడోన్నాకి గుర్తే.
 
 దాంతో పాటు పురుషాధ్యిక ప్రపంచం ఆమెను సుఖంగా బతకనివ్వలేదు. ఓసారి ఓ బిల్డింగ్ రూఫ్ సాక్షిగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో మడోన్నా గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కత్తి పట్టుకుని బెదిరించి మరీ, ఆ పాశవిక చర్యకు పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరుని మాత్రం మడోన్నా బయటపెట్టలేదు. ఈ పురుషాధ్యిక ప్రపంచంలో ఆ తర్వాత కూడా తనపై చాలా అత్యాచారాలు జరిగాయని, బతుకంటే చాలా భయమేసేదని ఆమె చెప్పారు. జస్ట్ ఇరవై అయిదేళ్లలోపే మడోన్నా ఓ జీవితానికి సరిపోయే అనుభవాలను ఎదుర్కొన్నారు. అవే ఆమెను రాటుదేలేలా చేశాయి. 
 
మూడు పదుల వయసు వచ్చేసరికి భయం స్థానంలో మొండితనం ఏర్పడిపోయింది. ఇక, పాప్‌స్టార్‌గా, నటిగా, దర్శకురాలిగా సక్సెస్ అయిన తర్వాత ఎవరికీ లొంగాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇప్పుడు మడోన్నాను ఎవరూ బెదిరించలేరు. ఒకర్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు కాబట్టే... కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె. ఇస్లామిక్ దేశాల్లో స్కూల్స్ కట్టిస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు లభించే ఆనందమే వేరంటున్నారు మడోన్నా.
 
>