మంకుపట్టుకు మనస్సాక్షి విడుపు

6 Nov, 2023 04:54 IST|Sakshi
పాలస్తీనాకు అనుకూలంగా న్యూయార్క్‌ ‘గ్రాండ్‌ సెంట్రల్‌ స్టేషన్‌’లో యూదుల ప్రదర్శన

కామెంట్‌

గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్‌ల పట్ల ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వేలాది మంది లండన్‌ వీధులలోకి రావడం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలోని మిక్కిలి ‘సుందరమైన’ దృశ్యాలలో ఇది ఒకటి అనిపిస్తుంది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు ప్యారిస్, బెర్లిన్‌ లాంటి నగరాలలోనూ జరిగాయి. యు.ఎస్‌.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్‌ వాయిసెస్‌ ఫర్‌ పీస్‌’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికన్‌ కాంగ్రెస్‌లోనూ, గ్రాండ్‌ సెంట్రల్‌ స్టేషన్‌లోనూ స్థానిక యూదులు భారీ ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? జరగబోయే అకృత్యాలను ఆపగలవా? ఏమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి.

ప్రజాస్వామ్యంలోని మిక్కిలి సుందరమైన దృశ్యాలలో ఒకటి – ఈ ‘సుందరమైన’ అనే విశేషణాన్ని నేను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగిస్తున్నాను – పదులు లేదా వందల వేలమంది తాము సహించరాని అన్యాయంగా భావిస్తున్న దానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనను వ్యక్తం చేయడం. ఆ నిరసనకు మీ సొంత ప్రభుత్వం దారి ఇచ్చిందా లేక ప్రపంచంలోని మరొక చివరన అది మలుపు తిరిగిందా అన్నది విషయమే కాదు. అదొక మూకుమ్మడి నైతిక వివేచనను రేకెత్తించిందన్నది, మానవుల ఆత్మను కదిలించిందన్నది ముఖ్యం. నిజానికి అది వారి ఉనికి యొక్క లోతు. అందుకే వారి స్పందన మానవత్వానికి సహేతుకమైన సమర్థన. అది మానవులను జంతువుల కన్నా ఉన్నతంగా ఉంచుతుంది.  

గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్‌ల పట్ల ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వందల వేల మంది లండన్‌ వీధులలోకి రావడం చూసినప్పుడు నాలో ఈ ఆలోచన మెదిలింది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు పారిస్, బెర్లిన్, అమెరికా నగరాలలోనూ జరిగాయి.  

వాస్తవానికి యు.ఎస్‌.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్‌ వాయిసెస్‌ ఫర్‌ పీస్‌’ ఆధ్వర్యంలో అమెరికన్‌ కాంగ్రెస్‌ లోనూ, అలాగే గ్రాండ్‌ సెంట్రల్‌ స్టేషన్‌లోను స్థానిక యూదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ సందర్భంలోనైతే అది విశ్వాసాల వెన్నుదన్నులను కలుపుకున్న మతం పట్టు కంటే గట్టిది.

నన్ను తప్పుగా అనుకోకండి. అక్టోబర్‌ 7న హమాస్‌ ఏదైతే చేసిందో అది అనాగరికమైనది, క్రూరమైనది, ఏమాత్రం క్షమార్హం కానిది. అయితే ఒక నెల తర్వాత అది అర్ధసత్యం మాత్రమే. హమాస్‌ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌ 9,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 22,000 మందిని గాయపరిచింది. మృతులలో నలభై శాతం మంది చిన్నారులే. విద్యుత్తు, నీరు, ఇంధనం, ఆహారం అంద కుండా చేస్తూ వస్తున్న కొన్ని వారాల దారుణమైన వైమానిక దాడుల తర్వాత ఇప్పుడు రెండవ దశ భూతల దాడులు ప్రారంభమయ్యాయి. 

నిరసనకారులు అడుగుతున్నది చాలా సరళమైనదనీ, సూటి అయినదనీ నేను ఊహించగలను. శిక్ష, ప్రతీకారం సమర్థనీయం అయినప్పటికీ ఇది చాలాదూరం వెళ్లలేదా? చాలాకాలం అయి పోలేదా?

ఉత్తర గాజాలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం కోసం దక్షిణం వైపునకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. కానీ అలా వెళ్లినవారు తలదాచుకున్న దక్షిణ ప్రాంతాలైన ఖాన్‌ యూనిస్, రాఫాల పైన కూడా బాంబులు కురిపించడం మొదలుపెట్టింది. ‘అల్‌ జజీరా’ ప్రతినిధి కుటుంబం నుసిరత్‌ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో మరణించింది. 

గాజా నగరంలో 600 మంది మాత్రమే పట్టే సామర్థ్యం గల షిఫా ఆసుపత్రి ఇప్పుడు బాంబు దాడుల నుంచి తప్పించుకోడానికి అక్కడికి చేరిన 20,000 మందితో కిక్కిరిపోయిందనీ; శిథిలాలు, మురుగు నీరును మాత్రమే తాము చూడగలుగుతున్నామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు. మత్తుమందు లేకుండానే ఆసుపత్రి కారిడార్‌ నేలపైన శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లుగా కూడా నివేదికలు అందుతున్నాయి. అదే నగరంలోని అల్‌ ఖుద్స్‌ ఆసుపత్రికి – నేరుగా వైమా నిక దాడులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నందున రోగులను ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు అందాయి. మరి ఇంక్యుబేటర్‌లలో, అత్యవసరంగా వెంటిలేటర్‌ల పైన ఉన్న శిశువులను ఎక్కడికి తరలించాలి?

గాజాకు అయిన వర్ణనాతీతమైన గాయం గురించి ఒక పాలస్తీనా వ్యక్తి గుండెను పిండేసే మాటలను ‘బీబీసీ’తో అన్నారు: ‘‘సురక్షితంగా ఉండేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి అని ప్రజలు అడగడం లేదు. మనం చనిపోయేటప్పటికి ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నారు.’’

నిజం ఏమిటంటే ఇజ్రాయెల్‌ అంత రాత్మ కూడా ఈ భయానక స్థితికి చలించింది. ఆ స్థితిని వ్యక్తీకరించడం అంత తేలిగ్గా కనిపించకపోవచ్చు. హమాస్‌ కంటే ఎక్కువ అని కాదు, హమాస్‌తో సమానంగా అణచి వేసే ప్రయత్నాలతో ఇజ్రాయెల్‌ ఏమీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. కనుక నెమ్మ దిగా, కానీ స్థిరంగా మాటలను కూడబలు క్కుంటోంది. 

‘హఆరెడ్జ్‌’... ఇజ్రాయెల్‌లో పేరున్న వార్తా పత్రిక. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిగిన మరుసటి రోజు, అక్టోబర్‌ 8న తన సంపాదకీయ వ్యాసంలో... ‘దాడి వల్ల ఇజ్రాయెల్‌కు సంభవించిన విపత్తుకు బాధ్యత వహించవలసిన ఒకే ఒక వ్యక్తి బెంజమిన్‌ నెతన్యాహూ’ అని రాసింది. పాలస్తీనా ఉనికిని, హక్కులను నెతన్యాహూ విస్మరించారని ఆరోపించింది.

9వ తేదీన ఆ పత్రిక ‘ప్రతీకార ఉద్యమాలకు, యుద్ధ నేరాలకు ఆస్కారం ఉండొచ్చు’ అని హెచ్చరించింది. ఆ పత్రిక వ్యాసకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గిడియన్‌ లెవీ 19వ తేదీన  ‘ఎనఫ్‌’ (చాలు) అనే శీర్షికతో సంపాదకీయం పేజీలో రాసిన వ్యాసాన్ని ‘ఈ రక్తపాతాన్ని తక్షణం ఆపి తీరాలి, వినాశానికి హద్దులు ఉంటాయి’ అని ప్రారంభించారు. 

ఇజ్రాయెల్‌ గురించి మీరేం అనుకున్నా, స్థానిక యూదు పౌరులకు అది ప్రజాస్వామ్య దేశం అనేందుకు ‘హఆరెడ్జ్‌’ ఒక కాదన లేని రుజువు. భారతదేశంలో ఈ విధమైన పరిస్థితుల్లో పత్రికలు రాసే సంపాదకీయాలు, అభిప్రాయాలు తీవ్రవాదం, దేశద్రోహం అభియో గాలను ఆహ్వానించవచ్చు. అంటే ఇజ్రాయెల్‌లోనూ ఇప్పుడు నిరస నల సౌందర్యం కనిపిస్తూ ఉంది.

అయితే ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? మరింత దారుణంగా జరగబోయే అకృత్యాలను అవి ఆపగలవా? చెప్పలేను. బహుశా ఆపలేవేమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి.అందుకు ఒకే కారణం అవి జరగవలసి ఉండటం. నిశ్శబ్దంగా ఉండ లేని స్వరాలు అవి. కనుక మాట్లాడటాన్ని మన మనస్సాక్షి కొన సాగిస్తూనే ఉంటుంది.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు