'మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం'

15 Dec, 2015 08:57 IST|Sakshi
'మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం'

గెటప్ శ్రీను
ఆకివీడు: చిన్నప్పటి నుంచి చిలిపి చేష్టలతో నలుగుర్ని నవ్వించి, కవ్వించి, అలరించడం వల్లే హాస్యాన్ని పండించగల్గుతున్నానని జబర్దస్త్ శ్రీనుగా పిలవబడుతూ గెటప్ శ్రీను అవతారంలో రాణించిన బుల్లితెర హాస్యనటుడు బొడ్డుపల్లి శ్రీను అన్నారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన సరిగమ సంగీత పరిషత్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన్ని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

‘కొల్లేరు తీరంలోని చినమిల్లిపాడు శివారు కాళింగపేటలో నేను జన్మించాను. చిన్నప్పటి నుంచి నా చిలిపిచేష్టలతో అందర్నీ నవ్వించేవాడ్ని. అప్పుడే అందరూ యాక్టర్ అవ్వరా.. అని దీవించారు. ఆ దీవెనలే నన్ను నేడు ఇంతటి వాడ్ని చేశాయి. కడుపునిండా భోజనం లేని రోజుల్లో మల్లెమాల సంస్థ కడుపు నింపింది. శ్యాంప్రసాద్ రెడ్డికి రుణపడి ఉంటాను. జబర్దస్త్ శ్రీనుగా 10 ఏపిసోడ్‌లతోనే బుల్లితెర హాస్యనటుడిగా ఎంతో గుర్తింపు వచ్చింది. నేను ఇల్లు నిర్మించుకుంటే దానికి ‘మల్లెమాల’ నిలయంగా పేరుపెట్టుకుంటాను. ఎన్నడూ కామెడీ నటుడ్ని అవుదామనుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనుకున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆదర్శం. ఆయన సినిమాలు చూసి, ఆయనలా హావభావాలతో అందర్ని అలరించేవాడ్ని.

నటులు కమలహాసన్,  కోటా శ్రీనివాసరావు, ఎస్‌వీ రంగారావు, ప్రకాష్‌రాజ్‌లవలే డిఫరెంట్ గెటప్‌లలో నటించాలనే ఆకాంక్ష ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్నాను. వెండితెరపై 6 సినిమాల్లో నటించాను. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఆకివీడు ప్రాంత భాష, యాసలతో బుల్లితెరపై హాస్యాన్ని పండిస్తున్నాను. నటులుగా రావాలనుకునే వారు ముందుగా బాగా చదువుకోండి. సినీ ఇండస్ట్రీలో రాజకీయాల గురించి నాకు తెలీదు.’ శ్రీనును వినియోగదారుల సమాక్య  జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య అభినందించారు.